ఏపీలో పెట్టుబడుల పేరుతో జరుగుతున్న తప్పుడు ప్రచారాలను రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా ఎండగట్టారు. “ఏపీలో ఉన్న ‘టీం 11’ ముఖం చూసి ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారా?” అంటూ ఆయన తీవ్ర వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పెట్టుబడులు తీసుకురావడానికి తాము విదేశాల్లో ప్రయత్నిస్తుంటే, ఏపీకి రావద్దంటూ కంపెనీలకు ఈ-మెయిల్స్ పంపే ‘ఏడుపుగొట్టు టీం’ రాష్ట్ర అభివృద్ధికి అడ్డు పడుతోందని విమర్శించారు. స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌లో నిర్వహించిన యూరప్ తెలుగు డయాస్పోరా సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడితో కలిసి పాల్గొన్న సందర్భంగా లోకేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో పెట్టుబడులు రావద్దన్న ఉద్దేశంతో కొందరు కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని లోకేశ్ ఆరోపించారు. సీఎం చంద్రబాబు నాయుడిని చూసి అంతర్జాతీయ కంపెనీలు ముందుకు వస్తే మాత్రం క్రెడిట్ తీసుకోవాలని చూస్తారని, అదే సమయంలో పెట్టుబడులు వస్తే మాత్రం అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. కోడికత్తి ఘటన, బాబాయి హత్య, కుటుంబ సభ్యులను గెంటేసిన వ్యవహారాలు, ప్రజాధనంతో విశాఖలో రూ.700 కోట్లతో ప్యాలస్ నిర్మించుకున్న వ్యవహారాలే వారి రాజకీయ క్రెడిట్ అని ఎద్దేవా చేశారు. అభివృద్ధి అంటే ఏడుపు, పెట్టుబడులు అంటే ఆందోళన – ఇదే ‘టీం 11’ స్వభావమని లోకేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
గత 18 నెలల్లో ప్రజా ప్రభుత్వం రూ.23.50 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకుందని, దీని ద్వారా 16 లక్షలకు పైగా ఉద్యోగాలు రాబోతున్నాయని లోకేశ్ వెల్లడించారు. దేశంలోకి వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 25.3 శాతం ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే రావడం రాష్ట్రానికి గర్వకారణమని చెప్పారు. పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచిందని తెలిపారు. గూగుల్, ఆర్సెలార్ మిట్టల్ వంటి దిగ్గజ సంస్థలు ఏపీ వైపు చూస్తున్నాయంటే దానికి కారణం ‘బ్రాండ్ సీబీఎన్’ అని స్పష్టం చేశారు.
తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన వ్యక్తి స్వర్గీయ ఎన్టీఆర్ అని కొనియాడిన లోకేశ్, ఆయన ఆశయాలకు అభివృద్ధిని జోడించి రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడని ప్రశంసించారు. చంద్రబాబు విజన్ కారణంగా ఆయనను గుడ్డిగా అనుసరించవచ్చని, ఆయన తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో అభివృద్ధి ఫలాలుగా నిలుస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఒకే రాజధాని అమరావతి, అభివృద్ధి వికేంద్రీకరణ ప్రభుత్వ అజెండా అని స్పష్టం చేస్తూ, చిత్తూరు–కడపను ఎలక్ట్రానిక్స్ హబ్‌గా, కర్నూలును రిన్యూవబుల్ ఎనర్జీ హబ్‌గా, ఉత్తరాంధ్రను ఫార్మా–ఐటీ హబ్‌గా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా ఏపీకి బ్రాండ్ అంబాసిడర్లుగా మారి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.