విశాఖపట్నంలో ఐటీ రంగాన్ని మరింత వేగంగా అభివృద్ధి చేసే దిశగా కీలక అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలో కాగ్నిజెంట్ సంస్థ కొత్త యూనిట్ భూమిపూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. వేడుకలో మాట్లాడుతూ ఒకే పిలుపుతో విశాఖ నుంచి 4,500 మంది నైపుణ్యున్నత యువత కాగ్నిజెంట్ సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారనే విషయం తనకు ఆనందంగా ఉందని అన్నారు. విశాఖపట్నం వంటి నగరానికి దేశంలో సాటి లేదని, మూడు దశాబ్దాల క్రితమే ఈ నగరం నాలెడ్జి ఎకానమీకి వెన్నెముక అవుతుందని చెప్పానని చంద్రబాబు గుర్తుచేశారు.
ఇప్పుడేమో విశాఖ ఏఐ హబ్‌గా మారే దిశలో వేగంగా అడుగులు వేస్తోందని ఆయన తెలిపారు. ఈరోజు ఎనిమిది కంపెనీలకు భూమి పూజ చేసినట్లు చెప్పిన సీఎం, రాబోయే నెలల్లో మరిన్ని ఐటీ–టెక్ పెట్టుబడులు విశాఖకు వస్తాయని ధైర్యంగా చెప్పారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చే ఆగస్టుకే సిద్ధమవుతోందని, మెట్రో రైల్ ప్రాజెక్ట్ కూడా ముందుకు కదులుతోందని తెలిపారు. విశాఖ అభివృద్ధి దిశగా ఇది భారీ మైలురాళ్లు అవుతాయని ఆయన అన్నారు.
విశాఖలో జీవన వ్యయం దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే సుమారు 20 శాతం తక్కువగా ఉందని చంద్రబాబు వివరించారు. ఈ అంశమే ఇక్కడి అభివృద్ధికి అత్యంత అనుకూల వాతావరణాన్ని అందిస్తోందని చెప్పారు. నగరాన్ని నెట్ జీరో కాలుష్య రహిత స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం దృఢమైన ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. డేటా సెంటర్లు విశాఖకు రావడానికి గ్రీన్ ఎనర్జీ అందుబాటు ప్రధాన కారణమని ఆయన చెప్పారు. రాష్ట్రంలో రూపాయి 99 పైసలకు భూమి కేటాయించే విధానం కంపెనీలకు ఎంతో ప్రయోజనకరమని, దీనివల్ల అనేక సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని తెలిపారు.
గూగుల్ రూ.15 బిలియన్లతో విశాఖలో డేటా సెంటర్‌ను ఏర్పాటు చేస్తోందని, టీసీఎస్ కూడా పెద్ద విస్తరణ ప్రణాళికలతో వస్తోందని సీఎం వెల్లడించారు. ప్రపంచ టెక్ దిగ్గజాలను నడిపిస్తున్న సీఈఓలలో చాలా మంది భారతీయులే కాకుండా తెలుగువారే ఉండటం గర్వకారణమని అన్నారు. శ్రీహరికోట సమీపంలో సాటిలైట్ సిటీ నిర్మాణం కొనసాగుతోందని, ఇది భవిష్యత్ అంతరిక్ష పరిశోధనల్లో కీలక పాత్ర పోషిస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. రియల్ టైమ్ క్లియరెన్స్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని, పెట్టుబడిదారులు ఇక ఇంటికే సిద్ధంగా ఉండి ప్రాజెక్టులు ప్రారంభించగలిగేలా సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆయన చెప్పారు.
ప్రతి ఒక్కరూ ఏఐను వినియోగించాలి ఆరోగ్య రంగంలో కూడా AI ఆధారిత సేవలను తీసుకువస్తున్నాం అని చంద్రబాబు తెలిపారు. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా వంటి దిగ్గజ సంస్థలు భారత్‌పై, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌పై ఆసక్తి చూపుతున్నాయని చెప్పారు. దేశం అభివృద్ధి పథంలో నిలబడటానికి సరైన సమయం, సరైన ప్రదేశం, సరైన నాయకత్వం కలిసొచ్చిన సందర్భం ఇదేనని, ప్రధాని మోదీ ఈ మార్పుకు నాయకత్వం వహిస్తున్నారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
కాగ్నిజెంట్ సంస్థ భవిష్యత్తులో లక్ష ఉద్యోగాలు కల్పించే దిశగా ముందుకు సాగాలని కోరుతూ, విశాఖను ప్రపంచ ఐటీ మ్యాప్‌లో మరింత బలంగా నిలబెట్టాలనే సంకల్పాన్ని సీఎం వ్యక్తం చేశారు.