రాష్ట్ర కేబినెట్ సమావేశానికి ముందుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను పలువురు మంత్రులు కలిసి తమ నియోజకవర్గాల్లో రహదారి అభివృద్ధికి మంజూరైన నిధులపై ధన్యవాదాలు తెలిపారు. గ్రామీణ రహదారుల పటిష్టతపై ప్రభుత్వం తీసుకున్న తాజా చర్యలను వారు అభినందించారు.
గత ప్రభుత్వ కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితి తీవ్రంగా దెబ్బతిని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడినట్లు మంత్రులు ఉప ముఖ్యమంత్రికి తెలియజేశారు. ఇప్పుడు పంచాయతీ రాజ్ శాఖ ద్వారా ఈ రహదారులు దశలవారీగా పునరుద్ధరించబడుతున్నందుకు ప్రజల తరఫున కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. గ్రామీణ కనెక్టివిటీ మెరుగుపడితే రోజు వారీ ప్రయాణాలు, వ్యవసాయ రవాణా, అత్యవసర సేవలు అందుబాటు విషయంలో పెద్ద మార్పు కనిపిస్తుందని వారు పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపిన వారిలో పయ్యావుల కేశవ్, అనిత, పొంగూరు నారాయణ, నాదెండ్ల మనోహర్, సవిత, డీవీబీ స్వామి, రామనాయుడు, సత్య అనగని, రాంప్రసాద్ రెడ్డి, బీసీ జనార్థన్, కందుల దుర్గేశ్ వంటి పలువురు మంత్రులు ఉన్నారు. వీరందరూ తమ తమ నియోజకవర్గాల్లో రహదారి పనులు వేగంగా పూర్తయ్యేలా ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరినట్లు సమాచారం.
పంచాయతీ రాజ్ శాఖ ఇప్పటికే మొదటి విడత నిధుల మంజూరుకు జీవో జారీ చేసింది. మొత్తం 157 నియోజకవర్గాల్లో 1,299 రహదారుల పటిష్టతకు రూ. 2,123 కోట్ల సాస్కీ నిధులు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ రహదారుల మొత్తం పొడవు సుమారు 4,007 కిలోమీటర్లు. రాష్ట్రంలోని 26 జిల్లాల పరిధిలో ఈ పనులు చేపట్టనున్నారు.
రహదారి అభివృద్ధి కార్యక్రమాలను 'పల్లె పండుగ 2.0' పేరిట అమలు చేస్తోంది ప్రభుత్వం. ఈ పథకం కింద గ్రామీణ రోడ్ల పునరుద్ధరణకు ఇటీవలే ఉప ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసి, పనులు త్వరితగతిన పూర్తయ్యేలా సూచనలు జారీ చేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితి మెరుగుపడటం ద్వారా ఆ ప్రాంతాల సమగ్రాభివృద్ధికి బాటలు వేయబడతాయని అధికారులు చెబుతున్నారు. పల్లె పండుగ 2.0 కింద మొదటి విడతలో చేపడుతున్న రహదారి పనులు పూర్తయ్యాక, రెండో విడతలో మరిన్ని రహదారులకు నిధులు కేటాయించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు సూచిస్తున్నాయి.
గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకున్న నేపథ్యంలో, ఈ నిధుల విడుదల ప్రజల సమస్యల పరిష్కారంలో కీలక ముందడుగుగా భావిస్తున్నారు.