పొగమంచు తీవ్రంగా కనిపించే శీతాకాల విమాన షెడ్యూల్‌కు ముందు అన్ని ఏర్పాట్లను సమీక్షిస్తూ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్ మోహన్ నాయుడు కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీజీసీఏ, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, వివిధ ఎయిర్‌లైన్లు, ఎయిర్‌పోర్ట్ మేనేజ్మెంట్‌లు, సీఐఎస్ఎఫ్ తదితర సంస్థల అధికారులు పాల్గొన్నారు. శీతాకాలంలో పొగమంచు ప్రభావంతో దేశవ్యాప్తంగా విమాన సర్వీసులు తరచుగా అంతరాయం కలిగే పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని, ముందస్తు చర్యలపై విస్తృత చర్చ జరిగింది.
మంత్రి మాట్లాడుతూ, పొగమంచు ఆపరేషన్లకు సంబంధించి రూపొందించిన నిబంధనలు, ప్రామాణిక విధానాలను (SOPs) అన్ని సంస్థలు తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. ఏ చిన్న నిర్లక్ష్యం జరిగినా వెంటనే గుర్తించి బాధ్యతను స్పష్టంగా నిర్ణయించాలని ఆదేశించారు. విమానాశ్రయాల్లో కలిగే రద్దీ, ల్యాండింగ్-టేకాఫ్ ఆలస్యాలు వంటి అంశాలను అధిగమించాలంటే ప్రతీ విభాగం సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
సౌకర్యవంతమైన ఆపరేషన్ల కోసం రియల్‌టైమ్ డేటా ఎక్స్చేంజ్ అత్యంత కీలకమని మంత్రి పేర్కొన్నారు. ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోల్ నుంచి ఎయిర్‌లైన్ల వరకు అన్ని విభాగాలు తాజా సమాచారం నిరంతరం పంచుకోవాలని ఆయన అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ నిర్ణయాలు తీసుకునేందుకు వార్ రూమ్‌లు యాక్టివ్‌గా పనిచేయాల్సిందిగా సూచించారు. అలాగే పొగమంచు పరిస్థితుల్లో ఆపరేట్ చేయగల CAT-II మరియు CAT-III అనుమతి ఉన్న విమానాలు మరియు వాటిని నడపడానికి అర్హత కలిగిన సిబ్బందిని మరింతగా వినియోగించాలని మంత్రి సూచించారు.
ప్రమాదరహిత, నిఖార్సైన, సమన్వయంతో కూడిన ఆపరేషన్లకోసం ఇప్పటికే స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశామని మంత్రి రామ్ మోహన్ నాయుడు వివరించారు. ప్రయాణికులు ముందుగానే తమ ప్రయాణ ప్రణాళికలను మార్చుకోవడానికి లేదా సవరించుకోవడానికి సహాయపడేలా సమాచారం సకాలంలో అందించాల్సిందిగా ఎయిర్‌లైన్లను ఆదేశించారు. విమానాల ఆలస్యాలు లేదా రద్దులు జరిగితే, అటువంటి అసౌకర్యానికి సంబంధించిన బాధ్యతను స్పష్టంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
“ప్రతి ఒక్క ప్రయాణికుడు మాకు ఎంతో ముఖ్యమని ఏ చిన్న అసౌకర్యం జరిగినా దానిని పెద్ద సమస్యగానే తీసుకుంటాం. ముందస్తు శీతాకాల నిర్వహణలో భద్రత, సమన్వయం, పారదర్శక సమాచారం ఇవన్నీ అత్యంత ప్రాధాన్యమైనవి’’ అని మంత్రి ట్వీట్‌లో పేర్కొన్నారు.
@MoCA_GoI మరియు @AAI_Officialను ట్యాగ్ చేస్తూ, శీతాకాలంలో దేశవ్యాప్తంగా విమాన సర్వీసులు సజావుగా కొనసాగేందుకు ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతోందని ఆయన స్పష్టం చేశారు.