ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని చేనేత రంగాన్ని బలోపేతం చేయడం, నేతన్నలకు ఆర్థిక భద్రత కల్పించడం లక్ష్యంగా కీలక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఆప్కో (APCO) వస్త్ర వాణిజ్య మండలిని తిరిగి పుంజుకునేలా ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తోంది. క్రిస్మస్, సంక్రాంతి పండుగల నేపథ్యంలో ప్రజలకు ఆకర్షణీయమైన ఆఫర్లతో ముందుకొచ్చింది.
ఈ పండుగల సీజన్‌కు ఆప్కో షోరూమ్‌లలో అందుబాటులో ఉన్న చేనేత, పట్టు, కాటన్ దుస్తులపై 30 నుంచి 40 శాతం వరకు భారీ రాయితీలు ప్రకటించింది. ఈ రాయితీలు దీపావళి నుంచి ప్రారంభమై 2026 సంక్రాంతి వరకు కొనసాగనున్నాయి. దీని ద్వారా వినియోగదారులకు నాణ్యమైన వస్త్రాలు తక్కువ ధరకు లభించడమే కాకుండా, నేతన్నల తయారీకి మంచి మార్కెట్ లభించనుంది.
ప్రభుత్వం ఉత్తరాంధ్ర ప్రాంతానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటికే విజయనగరం రీజియన్‌లో రూ.70 లక్షల విలువైన వస్త్రాలను కొనుగోలు చేయగా, ఉత్తరాంధ్రలోని ఐదు జిల్లాల్లో చేనేత అమ్మకాలను పెంచేందుకు చర్యలు చేపట్టింది. ఈ ఏడాది విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల షోరూమ్‌లకు రూ.7.20 కోట్ల అమ్మకాల లక్ష్యాన్ని నిర్ధేశించింది. పండుగల సీజన్‌లో కనీసం రూ.3 కోట్ల మేర అమ్మకాలు సాధించాలనే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించింది.
అమ్మకాలను పెంచేందుకు ఆప్కోలో 200కు పైగా కొత్త రకాల దుస్తులను సిద్ధం చేశారు. గతంతో పోలిస్తే మరింత వైవిధ్యభరితమైన డిజైన్లు, ట్రెండీ కలెక్షన్లు అందుబాటులో ఉంచడం ద్వారా యువత, కుటుంబాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో తయారైన చేనేత వస్త్రాలతో పాటు, తెలంగాణ, కోల్‌కతా, బెంగళూరు నుంచి నాణ్యమైన పట్టు చీరలను కూడా తెప్పించి షోరూమ్‌లలో విక్రయిస్తున్నారు. ఒక్కో షోరూమ్‌లో రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు స్టాక్‌ను నిల్వ ఉంచారు.
మార్కెటింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఈ-కామర్స్ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్ర వంటి ప్రముఖ ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంల ద్వారా ఆప్కో వస్త్రాలను విక్రయించే అవకాశాన్ని కల్పించింది. దీనివల్ల రాష్ట్రంలోని నేతన్నల తయారీ దేశవ్యాప్తంగా వినియోగదారులకు చేరుకునే అవకాశం ఏర్పడింది. అలాగే సంక్రాంతి సమయంలో జనసమ్మర్ధం ఎక్కువగా ఉండే అపార్ట్‌మెంట్లు, కాలనీలు, బహిరంగ ప్రదేశాల్లో ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఈ చర్యలన్నీ ఆప్కోను ఆర్థికంగా బలోపేతం చేయడం, చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకురావడం, నేతన్నల జీవితాల్లో స్థిరత్వం తీసుకురావడం లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తోంది. ప్రజలు ఈ పండుగల సందర్భంగా ఆప్కో షోరూమ్‌లలో లభిస్తున్న రాయితీలను వినియోగించుకుని, చేనేతకు మద్దతుగా నిలవాలని అధికారులు కోరుతున్నారు.