నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ పర్యటనకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా ఆయన శంషాబాద్‌లోని కన్హా శాంతివనంను సందర్శించనున్నారు. ఈ పర్యటనలో శాంతివనంలోని ఆధ్యాత్మిక, పర్యావరణ కార్యక్రమాలపై సమగ్రంగా అవగాహన పొందనున్నారు.
కన్హా శాంతివనంలో ముఖ్యమంత్రి హార్టిఫుల్‌నెస్ వ్యవస్థాపకులు, అధ్యక్షుడు దాజీతో భేటీ కానున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన వెల్‌నెస్, మెడిటేషన్ సెంటర్, యోగా కేంద్రాలను పరిశీలించనున్నారు. ధ్యానం, ఆరోగ్యం, మానసిక ప్రశాంతతకు సంబంధించిన కార్యక్రమాలపై అధికారులతో చర్చించనున్నారు.
అలాగే శాంతివనంలో ఏర్పాటు చేసిన ట్రీ కన్జర్వేషన్ సెంటర్, రెయిన్ ఫారెస్ట్ కేంద్రం, బయోచార్ కేంద్రాన్ని ముఖ్యమంత్రి సందర్శించనున్నారు. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి అంశాలపై శాంతివనం చేపడుతున్న చర్యలను ఆయన ప్రశంసించనున్నట్టు సమాచారం.
ఈ పర్యటనలో భాగంగా గోపీచంద్ స్టేడియం, హార్టిఫుల్‌నెస్ స్కూల్ను కూడా సీఎం తిలకించనున్నారు. అనంతరం కన్హా శాంతివనం వ్యవస్థాపకులు దాజీ నివాసానికి వెళ్లనున్న చంద్రబాబు, అక్కడ కొంతసేపు ప్రత్యేకంగా భేటీ కానున్నారు.
హైదరాబాద్ పర్యటన అనంతరం ముఖ్యమంత్రి మధ్యాహ్నం అమరావతికి చేరుకుంటారు. సచివాలయంలో అధికారులతో పలు శాఖలపై వేర్వేరు సమీక్ష సమావేశాల్లో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం విజయవాడకు చేరుకుని, అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణదినం సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే కార్యక్రమంలో పాల్గొననున్నారు.