ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. రహదారులు, పోర్టులు, రైల్వే మార్గాల విస్తరణ ద్వారా వాణిజ్య, పారిశ్రామిక రంగాలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో కీలక ప్రాజెక్టులను చేపడుతోంది. ఇందులో భాగంగా తాజాగా రైల్వే నెట్‌వర్క్‌ను మరింత బలపర్చే నిర్ణయం తీసుకుంది.
తిరుపతి జిల్లాలోని గూడూరు నుంచి తమిళనాడులోని గుమ్మిడిపూండి వరకు సుమారు రూ.1,723 కోట్ల వ్యయంతో మూడు, నాలుగు అదనపు రైల్వే లైన్ల నిర్మాణానికి రైల్వేశాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఆమోదం లభించడంతో పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ అదనపు లైన్లతో రైళ్ల రాకపోకల సామర్థ్యం గణనీయంగా పెరుగనుంది.
ప్రస్తుతం ఈ మార్గంలో రెండు రైల్వే లైన్లే ఉండగా, కొత్త లైన్ల నిర్మాణంతో ప్రయాణికులు మరియు సరుకు రవాణాకు మరింత వెసులుబాటు కలగనుంది. ముఖ్యంగా తీరప్రాంతంలోని పోర్టులకు సరుకు రవాణా వేగవంతమవుతుందని అధికారులు భావిస్తున్నారు. హౌరా–చెన్నై ప్రధాన రైల్వే మార్గంలో ఈ విస్తరణ కీలకంగా మారనుంది.
ఇదే సమయంలో విజయవాడ–గూడూరు మధ్య మూడో రైల్వే లైన్ నిర్మాణం పనులు వేగంగా సాగుతున్నాయి. మొత్తం 288 కిలోమీటర్ల మేర చేపట్టిన ఈ పనులకు రూ.6,238 కోట్లు కేటాయించగా, ఇప్పటికే 260 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయి. అలాగే విజయవాడ–గూడూరు మధ్య నాలుగో లైన్ నిర్మాణానికి సంబంధించిన సర్వే పనులు కూడా తాజాగా ప్రారంభమయ్యాయి.
గూడూరు నుంచి సూళ్లూరుపేట, అక్కడి నుంచి గుమ్మిడిపూండి వరకు మూడు, నాలుగు లైన్ల నిర్మాణానికి సంబంధించి డీపీఆర్‌ను కూడా సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే ప్రయాణికుల రైళ్లు, గూడ్స్ రైళ్లకు లైన్ క్లియర్‌గా ఉండి, ప్రయాణ సమయం తగ్గుతుంది. ముఖ్యంగా చెన్నై ప్రాంతానికి చేరుకునే సమయం గణనీయంగా తగ్గే అవకాశం ఉండటంతో, ఈ అభివృద్ధి రాష్ట్ర ఆర్థిక ప్రగతికి పెద్ద ఊతమిస్తుందని అధికారులు విశ్వసిస్తున్నారు.