గ్రామీణ పాలనలో మహిళలకు లభిస్తున్న రాజకీయ అవకాశాలు వాస్తవంలో ఎంతవరకు అమలవుతున్నాయన్న ప్రశ్న మరోసారి తెరపైకి వచ్చింది. మహిళ సర్పంచ్‌గా ఎన్నికైనా, పాలనా అధికారాలు ఆమె చేతుల్లో కాకుండా భర్తలు మామ ఏదో తండ్రి చేతుల్లోనే ఉండటం‘సర్పంచ్ పతి అనే పేరుతో దేశవ్యాప్తంగా కొనసాగుతున్న దురాచారంగా మారిందని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశాన్ని తేల్చేందుకు కమిషన్ కీలక అడుగు వేసింది. దేశవ్యాప్తంగా 32 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు షరతులతో కూడిన ప్రత్యేక నిబంధనలతో జారీ చేసి ఈ వ్యవహారంపై స్పష్టమైన నివేదికలు సమర్పించాలని ఆదేశించింది.
రాజ్యాంగం మహిళలకు రాజకీయ సాధికారత కల్పించాలనే ఉద్దేశంతో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించినప్పటికీ ఆ ఉద్దేశం క్షేత్రస్థాయిలో పూర్తిగా నెరవేరడం లేదన్నది ఎన్‌హెచ్‌ఆర్‌సీ అభిప్రాయం. పంచాయతీ ఎన్నికల్లో మహిళలు గెలిచిన వెంటనే, వారి స్థానంలో భర్తలు కుటుంబ బంధువులు అధికారాన్ని అనుభవిస్తున్న ఉదంతాలు అనేకం వెలుగులోకి వచ్చాయని కమిషన్ పేర్కొంది. మహిళ సర్పంచ్ పేరు మాత్రమే ఉండగా, నిర్ణయాలు, పాలనా వ్యవహారాలు అన్నీ వ్యవహరించే పురుషుల చేతుల్లోనే ఉండటం మహిళల మానవ హక్కులకు భంగం కలిగించే అంశమని స్పష్టం చేసింది.
హరియాణాకు చెందిన ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ అంశాన్ని ఎన్‌హెచ్‌ఆర్‌సీ విచారణకు స్వీకరించింది. మహిళా సర్పంచ్‌లు నామమాత్రపు పాత్రకే పరిమితమవుతున్నారన్న ఆరోపణలు తీవ్రమైనవని భావించిన కమిషన్, మానవ హక్కుల చట్టం–1993 ప్రకారం దీనిపై చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఈ ఏడాది సెప్టెంబర్ 9న అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నోటీసులు జారీ చేసినా, కొద్ది రాష్ట్రాల నుంచే స్పందన రావడంతో మిగిలిన వాటిపై కమిషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఈ నేపథ్యంలో తాజాగా 24 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలకు మరోసారి ఆదేశాలను జారీ చేసింది. పంచాయతీరాజ్, పట్టణ స్థానిక సంస్థల ఉన్నతాధికారులు ఈ అంశంపై తీసుకున్న చర్యల వివరాలను నివేదిక రూపంలో సమర్పించాలని ఆదేశించింది. డిసెంబర్ 22లోగా పూర్తి నివేదిక అందజేస్తే, డిసెంబర్ 30న వ్యక్తిగతంగా హాజరుకావాల్సిన అవసరం లేదని కూడా స్పష్టం చేసింది. లేదంటే సంబంధిత అధికారులు స్వయంగా కమిషన్ ఎదుట హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించింది.
ఎన్‌హెచ్‌ఆర్‌సీ సభ్యుడు ప్రియాంక్ కానూంగో ఈ ఆదేశాలపై సంతకం చేసినట్లు అధికారులు వెల్లడించారు. మహిళలు ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా వాస్తవ అధికారాలు వినియోగించలేకపోవడం రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధమని, ఇది లింగ వివక్షకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. మహిళా ప్రజాప్రతినిధులు స్వేచ్ఛగా, స్వతంత్రంగా తమ విధులు నిర్వర్తించే వాతావరణం కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని ఆయన గుర్తు చేశారు.
ఈ చర్యతో ‘సర్పంచ్ పతి’ అనే వ్యవస్థకు ఇక గట్టి చెక్ పడే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. గ్రామీణ పాలనలో మహిళలకు నిజమైన అధికారాలు లభించాలంటే, కేవలం చట్టాలు సరిపోవని, వాటి అమలుపై కఠిన నిఘా అవసరమని నిపుణులు అంటున్నారు. ఎన్‌హెచ్‌ఆర్‌సీ తాజా చర్యలు మహిళా సాధికారత దిశగా ఒక కీలక మలుపుగా మారుతాయా, లేక కాగితాలకే పరిమితమవుతాయా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.