మహిళల్లో మౌనం బలహీనత కాకూడదని కేంద్ర గ్రామీణ అభివృద్ధి మరియు కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డా.పెమ్మసాని చంద్ర శేఖర్ అన్నారు. లింగ సమానత్వ జాతీయ ప్రచార కార్యక్రమం నయీ చేతన 4.0 కార్యక్రమంను కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో డి.ఆర్.డి.ఏ సౌజన్యంతో తుళ్ళూరులో శనివారం నిర్వహించారు. నయీ చేతన 4.0 కార్యక్రమంలో భాగంగా సి.ఆర్.డి.ఎ స్కిల్ హబ్ భవనంలో
జెండర్ రిసోర్స్ సెంటర్ (GRC) ను మంత్రులు ప్రారంభించారు. అనంతరం స్థానిక ప్రైవేటు పాఠశాలలో జరిగిన సభను, ప్రదర్శన శాలలను మంత్రులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి డా.పెమ్మసాని చంద్ర శేఖర్ మాట్లాడుతూ వివక్ష తగ్గించడం నయీ చేతన 4.0 కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. సమాజంలో బాల్య వివాహాలు, గృహ హింస, లింగ వివక్ష వంటి రుగ్మతలు సమాజంలో జరుగుతున్నాయన్నారు. దేశంలో 4.50 లక్షల గృహ హింస కేసులు నమోదు అయ్యాయని గణాంకాలు తెలియజేస్తున్నాయని తెలిపారు. ప్రతి ముగ్గురిలో ఒక మహిళ వివక్షతకు గురి అవుతున్నట్లు అంచనా ఉన్నప్పటికీ అన్ని కేసులు నమోదు కావడం లేదని చెప్పారు. ఇందుకు
పరువు ప్రతిష్ట కోసం ఆలోచించడం కారణమని అన్నారు. అందుకే నయీ చేతన కార్యక్రమాన్ని 2021 సంవత్సరంలో శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు.
ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కార్యక్రమం ఉద్దేశ్యం అన్నారు. సురక్షిత ఆశ్రయం కల్పించుటకు రూ.5 లక్షలతో ఆశ్రయాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆశ్రయం నిర్వహణకు ఎస్.హెచ్.జి సభ్యులకు అవగాహన కల్పిస్తారని చెప్పారు. రాష్ట్రంలో రెండు వందల కేంద్రాలు మంజూరు చేశామని, వంద కేంద్రాలు ప్రారంభం అయ్యాయని తెలిపారు. తల్లిదండ్రులు, తాతలు పిల్లలలో చైతన్యం తీసుకురావాలని కోరారు.
ఎక్కడ వివక్ష జరిగినా ఇటువంటి కేంద్రాలకు వెళ్లాలని సూచించారు.
రాష్ట్రంలో 8 లక్షల స్వయం సహాయక సంఘాలు ఉండగా వాటిలో 80 లక్షల మంది సభ్యులు ఉన్నారని చెప్పారు.
దేశంలో 8 కోట్లు సంఘాలు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం ప్రతి మహిళ గొంతు వింటుందన్నారు. "మీ లక్ష్యాలు కలలు ముఖ్యం" అన్నారు. గృహ హింస జరిగితే వెంటనే ఫొటోలతో సహా సమాచారం అందించాలని కోరారు. మద్యం మత్తులో హింస పెరుగుతుందని అన్నారు. గృహ హింస, లింగ వివక్ష జరిగితే 181 నంబరు కు ఫోన్ చేయాలని చెప్పారు. తల్లికి వందనం పథకం కింద ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే పురుషులు వివిధ ఖర్చులకు వాడుతున్నారని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భారం ఉన్నా లక్షల కోట్లతో పథకాలు అమలు చేస్తుందని వాటిని సద్వినియోగం చేసుకుని "మీ కాళ్ళ మీద మీరు నిడబడాలి" అని పిలుపునిచ్చారు. పథకాలను ఆదాయంగా మలచుకోవాలన్నారు. మహిళలు సమాజాన్ని ముందుకు నడిపించాలన్నారు. అప్పుల భారం తగ్గించాలి అన్నారు. స్వయం సహాయక సంఘాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశ పెట్టారని, లింగ వివక్ష మార్పుకు నారా లోకేష్ కృషి చేస్తున్నారని తెలిపారు. మహిళలు స్వయం ఉపాధి అవకాశాలపై శిక్షణ తీసుకోవాలని, శిక్షణ, మార్కెటింగ్ కు ఆదుకుంటామని చెప్పారు. మహిళలకు నిలబడే ధైర్యాన్ని - మాట్లాడే స్వరాన్ని ఇవ్వాలని ఆకాక్షించారు.
రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ ఇదే ప్రాంతంలో రాజధాని ఉండాలని మహిళలు పోరాటం చేసిన నేల అన్నారు. కుటుంబం బాగుండాలంటే మహిళ అండగా ఉండటమే కారణం అన్నారు. కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుందన్నారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీల్లో మహిళలు రాణిస్తున్నారన్నారు. అంతరిక్షంలోకి మహిళలు వెళుతున్నారని చెప్పారు. ప్రతీ రంగంలో మహిళలు రాణిస్తున్నారని తెలిపారు. లింగ సమానత్వం వంట గది నుండి ప్రారంభం కావాలన్నారు. మహిళలు శారీరకంగా, మానసికంగా ధైర్యంగా, స్థైర్యంగా ఉండగలదన్నారు. లింగ సమానత్వం కోసం కొడుకులకు తెలియజేయాలని అన్నారు. మహిళా సాధికారతపై ఎన్.టి.ఆర్ అవకాశం కల్పించారని, ఆస్తిలో సమానత్వం, రాజకీయంగా మంచి అవకాశాలు ఇచ్చారన్నారు. భద్రత అవసరమని అందుకు మహిళలకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయడమే కాకుండా శక్తి యాప్ తీసుకువచ్చారని తెలిపారు. వన్ స్టాప్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. మహిళా భద్రత, లింగ సమానత్వంపై అందరూ సమష్టిగా కృషి చేయాలని సూచించారు.
రాష్ట్ర ఎం.ఎస్.ఎం.ఇ, సెర్ప్, ఎన్.ఆర్.ఐ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ 90 లక్షల మంది స్వయం సహాయక సంఘాల (ఎస్.హెచ్.జి) సభ్యులు ఉన్నారన్నారు. ఎస్.హెచ్.జిల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఎస్.హెచ్.జిలకు ఎటువంటి రుణాలు కావాలన్నా, వారి ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
శాసన సభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ ఇంటిలోనే సమానత్వం ప్రారంభం కావాలన్నారు. మహిళలు దేనిలోనూ తక్కువ కాదన్నారు. నైపుణ్యంతో కూడిన పనులు మహిళలు చేస్తారని తెలిపారు. ప్రతి అంశంలో మహిళను గౌరవించాలనే మానసిక స్థితిని తేవాలని పేర్కొన్నారు. లింగ వివక్ష నియంత్రణకు స్వయం సహాయక సంఘాలలో చర్చించాలన్నారు. ప్రతీ మహిళ కుటుంబాన్ని బాగు చేయుటకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి ఏ. సూర్య కుమారి మాట్లాడుతూ జెండర్ రిసోర్స్ సెంటర్ తో పాటు ట్రాన్స్ జెండర్ లకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. సమాజంలో ట్రాన్స్ జెండర్ లను కలుపుకోవాలని చెప్పారు. మహిళలకు మహిళలు ప్రోత్సహిస్తూ గొప్ప ముందడుగు వేయాలన్నారు.
జెండర్ ఛాంపియన్ చలివెంద్రి సుగంధి మాట్లాడుతూ చదువుతున్న మధ్యలో వివాహం చేశారు. ఆర్థికంగా ఇబ్బందికరంగా సాగింది. స్వయం సహాయక సంఘాలలో చేరి అవగాహన పొందాను. మహిళ ద్వారా కుటుంబాన్ని తీర్చిదిద్దవచ్చని తెలుసుకున్నాను. కిరాణా దుకాణం పెట్టుకున్నాను. జీవనం సాగిస్తున్నాను. మద్యానికి అలవాటు పడిన భర్తను మార్చుకోగలిగాను. పిల్లలను మార్చుకోగలిగాను.
జెండర్ ఛాంపియన్ తురకా శ్యామల మాట్లాడుతూ చిన్న వయసులో పెళ్లైంది. చదువుకోవాలనే కోరిక ఉండేది. పెళ్లి అయ్యాక చిన్న పనులు చేసుకుంటూ పిల్లలను చదివించాము. పిల్లలు ఇద్దరు పాఠశాలలో ప్రధమ స్థానంలో నిలిచారు. వారి ద్వారా పాఠశాలలో సన్మానాలు అందుకున్నాము.
జెండర్ ఛాంపియన్ లను మంత్రులు సత్కరించారు.
లింగ సమానత్వం కోసం అవగాహన కల్పిస్తూ లఘు నాటికను సెర్ప్ ద్వారా ప్రదర్శించారు. లింగ సమానత్వంపై అవగాహన కర దీపికను విడుదల చేశారు. సెల్ఫీ తీసుకున్నారు.
సీజనల్ వ్యాధులపై అవగాహన కోసం వైద్య ఆరోగ్యశాఖ ఉచిత వైద్య శిబిరం, మిషన్ శక్తి కార్యక్రమాలపై ఐసిడిఎస్, శక్తి టీంపై జిల్లా పోలీస్ శాఖ, మహిళా కార్మికులు పని ప్రదేశాల్లో సౌకర్యాలపై జిల్లా కార్మిక శాఖ, విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థుల సైన్స్ ఎగ్జిబిషన్, గ్రామీణ యువతకు డిడియు జీకేవై 2.0 ద్వారా శిక్షణ కార్యక్రమాలపై సీడాప్-డిఆర్డిఏ, స్వయం సహాయక సంఘాల వ్యాపార ఉత్పత్తులుతో విక్రయాలు, ప్రదర్శన శాలలను ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో పేదరిక నిర్మూలన సంస్థ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వాకాటి కరుణ, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, సెర్ప్ సంచాలకులు శివ శంకర్ ప్రసాద్, డి.ఆర్.డి.ఏ ఇన్ ఛార్జ్ ప్రాజెక్టు డైరెక్టర్ వి. విజయ లక్ష్మి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వి.జ్యోతి బసు, జిల్లా పంచాయతీ అధికారి బి.వి. నాగ సాయి కుమార్, స్వయం సహాయక సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.