ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరి రైతుల కోసం ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంది. రైతులు నష్టపోకుండా ఉన్నత మద్దతు ధరలు ప్రకటించింది. వరి ధాన్యాన్ని ఏ-గ్రేడ్ మరియు సాధారణ రకాలు గా రెండు విభాగాలుగా విభజించి, వాటికి అనుగుణంగా ధరలు నిర్ణయించింది. వరి ధాన్యం అమ్ముకునేందుకు జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో, రైతులు తమ పంటను నేరుగా ప్రభుత్వానికి విక్రయించే అవకాశం కల్పించబడింది.
ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర ప్రకారం, ఏ-గ్రేడ్ వరికి క్వింటా ₹2,389, సాధారణ వరికి క్వింటా ₹2,369 చెల్లించబడుతుంది. అయితే ఈ ప్రయోజనాలు పొందాలంటే రైతులు ఈ-క్రాప్ రిజిస్ట్రేషన్ చేసి ఉండాలి. అలాగే ఈ-KYC పూర్తిగా ఉండటం కూడా తప్పనిసరి. ఇటీవల వర్షాల వల్ల పంటలకు నష్టం కలగడంతో ఈ ధరలు రైతులకు మరింత ఉపశమనంగా ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది.
రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లినప్పుడు ముందుగా రవాణా ఖర్చులు తమ ఖర్చులతో భరించాల్సి ఉంటుంది. కానీ తరువాత ప్రభుత్వం ఆ మొత్తాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. అదనంగా, హమాలీల ఖర్చు, గోనె సంచుల ఖర్చు కూడా ప్రభుత్వం భరిస్తామని తెలిపింది. రైతులే సంచులు లేదా హమాలీలను ఏర్పాటు చేసుకున్న పరిస్థితిలో కూడా ప్రభుత్వం ఆ ఖర్చును రీయింబర్స్ చేస్తుంది.
ధాన్యం నాణ్యత విషయంలో ప్రభుత్వం కొన్ని నిబంధనలు స్పష్టంగా తెలిపింది. వరి ధాన్యంలో ఇసుక, మట్టి, రాళ్లు ఒక శాతం కంటే ఎక్కువ ఉండకూడదు. అలాగే రంగుమారిన ధాన్యం లేదా మొలకెత్తిన గింజలు ఐదు శాతం కంటే ఎక్కువ ఉండకూడదు. ఈ ప్రమాణాలు పాటిస్తేనే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ధాన్యం స్వీకరిస్తాయి.
రైతుల సౌకర్యార్థం ఆధునిక సాంకేతికతను కూడా ప్రవేశపెట్టింది. ఏపీ రైతులు ఇప్పుడు తమ ధాన్యాన్ని అమ్ముకునేందుకు వాట్సాప్ నంబర్ 7337359375 కు “Hi” పంపితే చాలు. వెంటనే అధికారులు స్పందించి, అవసరమైన వివరాలను తీసుకుంటారు. ఎంత ధాన్యం ఉంది, ఏ రకం, ఎన్ని రోజుల్లో తరలిస్తారు వంటి వివరాలు ఇచ్చిన తర్వాత, సమీప రైస్ మిల్లులు, కొనుగోలు కేంద్రాలు, స్లాట్ బుకింగ్ వివరాలు కూడా వాట్సాప్ ద్వారానే పొందవచ్చు. ఈ విధానం రైతులకు చాలా సులభతరం అవుతుందని అధికారులు పేర్కొన్నారు.