ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2029 నాటికి రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రయత్నంలో భాగంగా తిరుమల–తిరుపతి ప్రాంతాల్లో కాలుష్యాన్ని తగ్గించాలని ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రస్తుతం ఉన్న సర్వీసులకు అదనంగా 50 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ ఆమోదించింది. అలాగే సీఎం సూచన మేరకు తిరుమలకు మరో 300 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించే ప్రక్రియ వేగంగా సాగుతోంది.
ప్రస్తుతం తిరుమల ఘాట్‌రోడ్లలో 64 ఎలక్ట్రిక్ బస్సులు, అలాగే నెల్లూరు, మదనపల్లె, కడప మార్గాల్లో మరో 36 ఎలక్ట్రిక్ సర్వీసులు నడుస్తున్నాయి. భక్తుల రద్దీ పెరుగడంతో ఈ సంఖ్యను ఇంకా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో రానున్న 50 కొత్త ఈ-బస్సులను ‘ఈకా’ సంస్థ వచ్చే 3–6 నెలల్లో ఆర్టీసీకి సరఫరా చేయనుంది. తిరుమలలో పర్యావరణ పరిరక్షణకు ఇవి కీలకంగా ఉంటాయని అధికారులు అంటున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలతో మరో 300 ఎలక్ట్రిక్ బస్సుల ప్రతిపాదనను కేంద్రానికి పంపగా, కేంద్రమూ దీనికి సానుకూలంగా స్పందించింది. పీఎంఈ–సేవ పథకం కింద కేంద్రం నోడల్ ఏజెన్సీగా పనిచేస్తోంది కాబట్టి తక్కువ ధరకు ఎలక్ట్రిక్ బస్సులు లభిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం మొత్తం 11 నగరాలను ఎలక్ట్రిక్ బస్సుల కోసం ఎంపిక చేసింది. అందులో తిరుపతికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు.
ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య పెరగడంతో ఛార్జింగ్ స్టేషన్ల అవసరం కూడా పెరుగుతోంది. ప్రస్తుతం అలిపిరి, తిరుపతి బస్టాండ్‌లో 36 ఛార్జింగ్ పాయింట్లు ఉన్నాయి. కొత్త బస్సులు రానున్న నేపథ్యంలో తిరుమలలో కొత్త బస్ డిపో నిర్మించేందుకు ఆర్టీసీ నిర్ణయించింది. దీనికోసం 5 ఎకరాల స్థలం ఇవ్వాలని టీటీడీకి విజ్ఞప్తి చేయగా, వారు సానుకూలంగా స్పందించారు. తిరుపతిలో కూడా శ్రీనివాసం, అచ్యుతం కాంప్లెక్సుల వద్ద కొత్త ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటయ్యే అవకాశం ఉంది.
ప్రస్తుతం తిరుమల ఘాట్ రోడ్లలో 323 డీజిల్ బస్సులు నడుస్తున్నాయి. అయితే కొత్త ఈ-బస్సులు అందుబాటులోకి వచ్చిన తర్వాత 2029 నాటికి డీజిల్ బస్సులన్నీ పూర్తిగా నిలిపివేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈవీ పాలసీ అమలుతో తిరుమల–తిరుపతిని పూర్తిగా పర్యావరణ హితంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యం.