ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రహదారులు, జాతీయ రహదారుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో కీలక రోడ్డు ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తోంది. ఈ క్రమంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరో ప్రధాన రహదారి విస్తరణకు రంగం సిద్ధమైంది. అమలాపురం వెళ్లే ప్రయాణికులకు ఎంతోకాలంగా ఎదురవుతున్న ట్రాఫిక్ సమస్యకు పరిష్కారంగా కొత్త జాతీయ రహదారి ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. ఇప్పటివరకు అమలాపురం చేరుకోవాలంటే రావులపాలెం–కొత్తపేట–అంబాజీపేట మార్గమే ప్రధానంగా ఉండడంతో ఈ రహదారి ఎప్పుడూ రద్దీగా మారుతోంది. వేల సంఖ్యలో వాహనాలు రోజూ ఈ మార్గంలో తిరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఈ ట్రాఫిక్ భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గంగా కొత్త జాతీయ రహదారి నిర్మాణాన్ని వేగవంతం చేసింది. రావులపాలెం నుంచి అమలాపురం మండలం పేరూరు కూడలి వరకు 32 కిలోమీటర్ల పొడవునా NH 216E రహదారి నిర్మాణానికి చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ కొత్త రహదారి NH 216కు అనుసంధానంగా ఉంటుంది. దీనివల్ల అమలాపురం వెళ్లే ప్రయాణికులకు మరో మార్గం అందుబాటులోకి రానుంది. ఈ రహదారి పూర్తయితే ప్రయాణ సమయం గణనీయంగా తగ్గి, అరగంటలోనే అమలాపురం చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం రూ.630 కోట్ల అంచనా వ్యయంతో ఈ రహదారి నిర్మాణం చేపడుతున్నారు.
ఈ ప్రాజెక్టు కోసం సుమారు 140 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉండగా, అందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ప్రభుత్వం ఇప్పటికే జారీ చేసింది. ఈ భూముల్లో ఎక్కువ భాగం వ్యవసాయ భూములే కాగా, కొన్ని చోట్ల పంట కాలువలు, గ్రామ కంఠాలు, ప్రభుత్వ పోరంబోకు భూములు, కాలిబాటలు, శ్మశానవాటికలు కూడా ఉన్నాయి. ఈ జాతీయ రహదారి అమలాపురం మండలం పేరూరు వద్ద ప్రారంభమై, రావులపాలెం వద్ద NH 216Aతో అనుసంధానం అవుతుంది. ఇందుపల్లి, ఈదరపల్లి, బండారులంక, నడిపూడి, పాలగుమ్మి, నేదునూరు, మొసలపల్లి, వక్కలంక, పుల్లేటికుర్రు, మోడేకుర్రు, అవిడి, పలివెల, కొత్తపేట, దేవరపల్లి, వెదిరేశ్వరం, లక్ష్మీపోలవరం వంటి గ్రామాల మీదుగా ఈ రహదారి నిర్మాణం జరగనుంది.
భూసేకరణ ప్రక్రియలో భాగంగా రైతుల అభిప్రాయాలకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. నోటిఫికేషన్‌లో పేర్కొన్న సర్వే నంబర్లలో భూములు ఉన్న రైతులు తమ అభ్యంతరాలను 21 రోజులలోగా లిఖితపూర్వకంగా సమర్పించాలని అధికారులు సూచించారు. పరిహారం, భూముల విలువ లేదా ఇతర అంశాలపై ఏవైనా సమస్యలు ఉంటే, డా.బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చు. నిర్ణీత గడువులోగా అభ్యంతరాలు తెలియజేయని పక్షంలో, ప్రభుత్వ నిర్ణయానికి అంగీకరించినట్లుగా భావిస్తామని స్పష్టం చేశారు. ఈ రహదారి పూర్తయితే కోనసీమ జిల్లాలో రవాణా సౌకర్యాలు మరింత మెరుగవుతాయని, అభివృద్ధికి కొత్త బాటలు తెరుచుకుంటాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు.