Amaravati Bill: ఐదు కోట్ల ఆంధ్రుల విజయం - సీఎం చంద్రబాబు హర్షం..!
Amaravati Bill: పార్లమెంట్‌లో ఏపీ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు-2026 ఏకగ్రీవంగా ఆమోదం పొందడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం అమరావతి రైతులకు అంకితమని, ఆంధ్రుల ఆకాంక్ష నెరవేరిందని ఆయన పేర్కొన్నారు
Amaravati Bill: ఆంధ్రప్రదేశ్ జీవనాడి, కోట్లా మంది ప్రజల కలల రాజధాని అమరావతికి సంబంధించి దేశ అత్యున్నత చట్టసభలో కీలక ముందడుగు పడింది. పార్లమెంట్‌లో ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2026 ఏకగ్రీవంగా ఆమోదం పొందడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇది ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయమని, ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్షలు నేడు నెరవేరాయని ఆయన కొనియాడారు. ఈ విజయం కేవలం ప్రభుత్వానిది మాత్రమే కాదు, ప్రతి ఆంధ్రుడి గర్వకారణమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
అమరావతి నిర్మాణంలో ప్రధాని నరేంద్ర మోదీ పాత్రను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. 2015లో రాజధాని నగరానికి పునాది వేయడం నుంచి, 2025లో పునర్నిర్మాణ పనుల వరకు ప్రధాని అండగా నిలిచారని గుర్తు చేసుకున్నారు. బిల్లు ఆమోదానికి సహకరించిన ప్రధాని మోదీకి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అందించిన ఈ సహకారం రాష్ట్ర అభివృద్ధికి పెద్ద పీట వేస్తుందని, కేంద్ర-రాష్ట్రాల అనుబంధం ఏపీని అగ్రపథాన నిలుపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ముఖ్యంగా అమరావతి రైతుల పోరాటాన్ని చంద్రబాబు ఈ సందర్భంగా స్మరించుకున్నారు. "ఈ విజయం అమరావతి రైతులకే అంకితం" అని ఆయన ప్రకటించారు. గత కొన్నేళ్లుగా రాజధాని కోసం రైతులు చేసిన భూత్యాగం, వారు ఎదుర్కొన్న కష్టాలు, చూపిన పట్టుదల మరువలేనివని కొనియాడారు. రాజధానిపై గతంలో ఉన్న సందిగ్ధతలకు, అడ్డంకులకు నేటితో పూర్తిగా తెరపడిందని, ఇకపై అమరావతి ఏకైక ప్రజా రాజధానిగా వెలుగులీనుతుందని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ అనేక సవాళ్లను, ఇబ్బందులను ఎదుర్కొందని చంద్రబాబు భావోద్వేగానికి లోనయ్యారు. ఆ చీకటి రోజులకు ఈ బిల్లు ఆమోదం ఒక ముగింపు పలికిందని, రాష్ట్ర ప్రగతికి ఇది ఒక కొత్త నాంది అని చెప్పారు. అమరావతిని కేవలం ఒక నగరంగా చూడటం లేదని, అది ఏపీకి గుండె ఆత్మ అని ఆయన అభివర్ణించారు. రాజధాని నగరం ఇకపై 'అన్‌స్టాపబుల్' అని, అభివృద్ధి పథంలో దూసుకుపోతుందనే నమ్మకాన్ని ప్రజలకు కలిగించారు.
రాబోయే రోజుల్లో అమరావతిని దేశంలోనే అత్యుత్తమ భవిష్యత్ నగరంగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. సుస్థిరమైన పరిపాలన, ఆధునిక వసతులతో అమరావతి ఒక ప్రపంచ స్థాయి నగరంగా నిలుస్తుందని ఆకాంక్షించారు. పార్లమెంటులో పార్టీలకతీతంగా బిల్లుకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఏపీలో నూతన శకం ప్రారంభమైందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఒక గొప్ప సంకల్పంతో మొదలైన అమరావతి ప్రయాణం నేడు గమ్యానికి చేరుకుందని ఆయన పేర్కొన్నారు.
Be the first to react