North Korea News: ఉత్తర కొరియా కొత్త ప్రయోగం... విద్యుదయస్కాంత ఆయుధాలతో ప్రపంచానికి హెచ్చరిక..!
North Korea Ballistic Missile Test: ఉత్తర కొరియా మరోసారి సంచలన ఆయుధ పరీక్షలు చేపట్టింది. శత్రువుల కమ్యూనికేషన్, విద్యుత్ వ్యవస్థలను చిన్నాభిన్నం చేసే విద్యుదయస్కాంత ఆయుధాలను కిమ్ సర్కార్ విజయవంతంగా పరీక్షించింది. ఈ కొత్త ఆయుధాల సామర్థ్యం అంతర్జాతీయ పరిణామాలు..
North Korea Ballistic Missile Test: అంతర్జాతీయ ఆంక్షలను ఏమాత్రం లెక్కచేయకుండా ఉత్తర కొరియా మరోసారి కయ్యానికి కాలు దువ్వుతుంది. గడిచిన మూడు రోజులుగా వరుస ఆయుధ పరీక్షలతో కొరియా ద్వీపకల్పంలో అలజడి సృష్టించింది. ఈసారి కేవలం సాధారణ క్షిపణులు మాత్రమే కాకుండా, శత్రువుల సాంకేతిక వ్యవస్థను కుప్పకూల్చే అత్యంత ప్రమాదకరమైన 'ఎలక్ట్రోమాగ్నెటిక్' ఆయుధాన్ని పరీక్షించినట్లు ఆ దేశ అధికారిక మీడియా సంస్థ కేసీఎన్ఏ వెల్లడించింది. ఈ ప్రయోగాలను జనరల్ కిమ్ జోంగ్ సిక్ స్వయంగా పర్యవేక్షించడం విశేషం.
సాధారణంగా బాంబులు పేలితే ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతుంది. కానీ ఈ విద్యుదయస్కాంత ఆయుధాలు నేరుగా శత్రువుల విద్యుత్ గ్రిడ్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు కంప్యూటర్ నెట్‌వర్క్‌లను క్షణాల్లో నిర్వీర్యం చేస్తాయి. దీనితో పాటు 'కార్బన్ ఫైబర్' బాంబులను కూడా పరీక్షించినట్లు కిమ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఆయుధాలు యుద్ధ సమయంలో వ్యూహాత్మకంగా చాలా కీలకమని, శత్రువులను కోలుకోలేని దెబ్బ తీస్తాయని ఉత్తర కొరియా సైనిక వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
మరోవైపు, కేవలం కొత్త సాంకేతికతనే కాకుండా తన వద్ద ఉన్న క్షిపణుల సామర్థ్యాన్ని కూడా ఉత్తర కొరియా మరోసారి తనిఖీ చేసింది. భూతలం నుండి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించింది. ఈ క్షిపణులు దాదాపు 7 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న ఏ లక్ష్యాన్నైనా బూడిద చేయగలవని సైన్యం ప్రకటించింది. ఈ క్లస్టర్ బాంబుల పవర్ చూసి పొరుగు దేశాలైన దక్షిణ కొరియా జపాన్ ఆందోళన చెందుతున్నాయి. ఐక్యరాజ్యసమితి ఎన్ని ఆంక్షలు విధించినా కిమ్ జోంగ్ ఉన్ దూకుడు తగ్గకపోవడం గమనార్హం.
ప్రస్తుతం ప్రపంచ రాజకీయాల్లో మారుతున్న సమీకరణాల నేపథ్యంలో ఈ ప్రయోగాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఒకవైపు రష్యాకు మద్దతుగా నిలుస్తున్న ఉత్తర కొరియా, మరోవైపు చైనాతో సంబంధాలను మరింత బలపరుచుకుంటోంది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఆరేళ్ల తర్వాత ప్యోంగ్యాంగ్‌లో పర్యటిస్తున్న తరుణంలోనే ఈ పరీక్షలు జరగడం చూస్తుంటే, అమెరికా మరియు దాని మిత్రదేశాలకు ఒక బలమైన సందేశాన్ని పంపడమే ఉత్తర కొరియా లక్ష్యంగా కనిపిస్తోంది.
దక్షిణ కొరియా జపాన్ మిలిటరీ వర్గాలు ఈ పరీక్షలపై నిఘా ఉంచాయి. మంగళవారం ఉత్తర కొరియా ప్రయోగించిన ఒక క్షిపణి గాలిలో ఉండగానే విఫలమైనట్లు దక్షిణ కొరియా గుర్తించింది. అయినప్పటికీ, బుధవారం నాటి ప్రయోగాలు సక్సెస్ కావడంతో ఆ ప్రాంతంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇప్పటికే డ్రోన్ల విషయంలో ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య మాటల యుద్ధం నడుస్తుండగా, తాజాగా జరిగిన ఈ భారీ ఆయుధ పరీక్షలు శాంతి చర్చలకు మరింత విఘాతం కలిగించేలా ఉన్నాయి.
Be the first to react