ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలోని ప్రసిద్ధ బోండీ బీచ్‌లో యూదుల హనుక్కా వేడుకల సందర్భంగా జరిగిన కాల్పుల ఘటన దేశాన్ని తీవ్రంగా కలచివేసింది. ఈ దాడిలో కనీసం 15 మంది మృతి చెందగా,మరెంతో మంది గాయపడ్డారు. కఠిన గన్ చట్టాలు ఉన్న ఆస్ట్రేలియాలో దాదాపు మూడు దశాబ్దాల తరువాత చోటుచేసుకున్న అత్యంత ఘోర కాల్పుల ఘటనగా ఇది గుర్తించబడింది.
పోలీసుల విచారణలో ఈ దాడికి పాల్పడింది తండ్రి–కొడుకు అని తేలింది. 50 ఏళ్ల సజీద్ అక్రమ్ అనే వ్యక్తిని పోలీసులు కాల్చి చంపగా, అతని 24 ఏళ్ల కుమారుడు నవీద్ అక్రమ్ గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన హనుక్కా పండుగ మొదటి రోజున యూదుల సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని జరగడంతో, ఇది ద్వేషపూరిత దాడిగా అధికారులు పేర్కొన్నారు.
విచారణలో సజీద్ అక్రమ్ ఒక పండ్ల దుకాణం యజమానిగా గుర్తించారు. అతనికి దాదాపు 10 సంవత్సరాలుగా గన్ లైసెన్స్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కుమారుడు నవీద్ ఆస్ట్రేలియాలో పుట్టిన పౌరుడు కాగా, రెండు నెలల క్రితం ఉద్యోగం కోల్పోయినట్లు సమాచారం. గతంలో అతనిపై తీవ్రవాద సంబంధాలపై అనుమానంతో నిఘా ఉన్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి.
ఈ దాడి జరిగిన సమయంలో బోండీ బీచ్ వద్ద వేలాది మంది ఉన్నారు. వారిలో సుమారు వెయ్యి మంది హనుక్కా వేడుకల్లో పాల్గొన్నారు. దాడి దాదాపు 10 నిమిషాల పాటు కొనసాగిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. కాల్పులు జరగడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఈ సమయంలో ఒక సాధారణ పౌరుడు దాడిచేసిన వ్యక్తిని ఎదుర్కొని ఆయుధాన్ని కింద పడేయడం దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందింది.
మృతుల వయస్సు 10 నుంచి 87 ఏళ్ల మధ్య ఉండగా, యూదుల మత గురువు రబ్బీ ఎలి శ్లాంగర్ కూడా మృతుల్లో ఉన్నారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని ఆల్బనీస్ ఈ ఘటనను “దేశ చరిత్రలో చీకటి రోజు”గా అభివర్ణించారు. ప్రపంచవ్యాప్తంగా పలువురు నేతలు ఈ దాడిని ఖండించారు. ద్వేషం, హింసకు తావులేని సమాజాన్ని నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని ఆస్ట్రేలియా ప్రభుత్వం హామీ ఇచ్చింది.