భారత ప్రభుత్వ రంగ సంస్థ ఇండియా పోస్ట్, ఆధునికత వైపు గట్టి అడుగులు వేస్తోంది. ప్రైవేట్ కోరియర్ కంపెనీల పోటీలో నిలవడానికి మాత్రమే కాక, యువతను తనవైపు తిప్పుకోవడానికీ పూర్తిగా కొత్త దిశలో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో ‘జెన్ Z పోస్టాఫీసులు’ అనే వినూత్న కాన్సెప్ట్‌ను తీసుకొస్తూ, పోస్టల్ సేవలకు నూతన తరహా లుక్, డిజిటల్ సౌకర్యాలు కలిపి కొత్త ఇమేజ్‌ను సృష్టిస్తోంది. ఇప్పటికే ఢిల్లీ, ముంబైలో ఈ ఆధునిక పోస్టాఫీసులు మంచి ఆదరణ పొందగా, తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఈ ప్రయోగం ప్రారంభమైంది. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన జెన్ Z పోస్టాఫీస్ యువతను బాగా ఆకట్టుకుంటోంది.
డిజిటల్ ఫస్ట్ ఇండియాలో దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ సేవలను క్రమంగా డిజిటల్ చేస్తున్న తరుణంలో, పోస్టల్ శాఖ కూడా ఈ కొత్త పోస్టాఫీసుల ద్వారా డిజిటలైజేషన్‌ను ఇంకా వేగవంతం చేస్తోంది. కేవలం పోస్టల్ సేవలే కాదు, విద్యార్థులకు అవసరమైన సోషల్ లెర్నింగ్ స్పేస్, స్టడీ కార్నర్స్, చిన్న లైబ్రరీ, ఉచిత వైఫై వంటి సౌకర్యాలతో ఈ పోస్టాఫీస్‌ను ఒక మల్టీ-యూజ్ హబ్‌గా తీర్చిదిద్దారు. విద్యార్థులు ఇక్కడే కూర్చొని చదువుకోవచ్చు, గ్రూప్ స్టడీ చేయవచ్చు, పోస్టల్ సేవలను కూడా స్మార్ట్‌గా పొందవచ్చు. త్వరలో గుంటూరు, కర్నూలులో కూడా ఇలాంటివే జెన్ Z పోస్టాఫీసులు ప్రారంభించనున్నట్లు పోస్టల్ శాఖ ప్రకటించింది.
ఈ పోస్టాఫీసులలో మరో ముఖ్యమైన అంశం—ఇవి పూర్తిగా సెల్ఫ్-సర్వీస్ మోడల్ పై పనిచేయడం. ఇక్కడ అధికారులు శాశ్వతంగా ఉండరు. విద్యార్థులు తమ స్మార్ట్‌ఫోన్లు ఉపయోగించి, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి, పార్సిల్ బుకింగ్, స్పీడ్ పోస్ట్, ఇతర పోస్టల్ సేవలను స్వయంగా పూర్తి చేసుకోవచ్చు. అవసరం అయితే ఒకే ఒక పోస్టల్ సహాయకుడు మాత్రమే అక్కడ ఉంటారు. ఇది పోస్టల్ సేవలను పూర్తిగా డిజిటల్ దిశగా మార్చిన తొలి పెద్ద అడుగుగా భావిస్తున్నారు. యువత ఎక్కువగా మొబైల్, ఆన్‌లైన్ సేవలకు అలవాటు పడినందున, ఈ కొత్త పోస్టాఫీసులు వారిని ప్రభుత్వ సేవలకు మరింత దగ్గర చేయగలవని అధికారులు చెబుతున్నారు.
ఈ ఆధునిక పోస్టాఫీసులపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా ప్రశంసలు కురిపించారు. తన ఎక్స్ అకౌంట్‌లో ఆయన చేసిన పోస్ట్‌లో, “డిజిటల్ ఇండియా ఇప్పుడు మరింత దగ్గరైంది. పోస్టాఫీసులకు నూతన జనరేషన్ టచ్ రావడం ఆనందంగా ఉంది” అని పేర్కొన్నారు. ఆంధ్రా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ఈ జెన్ Z పోస్టాఫీస్ రాష్ట్రంలో మొదటిదని, ఇది క్యాంపస్ కల్చర్‌కు తగ్గట్లుగా ప్రత్యేకంగా రూపుదిద్దుకుందని తెలిపారు. మొత్తానికి, ఇండియా పోస్ట్ కొత్త పంథా యువతను ఆకట్టుకుంటూ, ప్రభుత్వ సేవలకు ఆధునిక యుగానికొత్త నిర్వచనం ఇస్తోంది.