త్రివిధ దళాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు సాధించాలనుకునే యువతకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) శుభవార్త అందించింది. నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA), నేవల్ అకాడమీ (NA) ఎగ్జామినేషన్ (1)–2026కు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ను తాజాగా విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 2026 సంవత్సరానికి మొత్తం 394 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు యూపీఎస్సీ వెల్లడించింది. ఇందులో పురుషులకు 370 పోస్టులు, మహిళలకు 24 పోస్టులు కేటాయించారు. అర్హత కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 30, 2025 వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల విభజనను పరిశీలిస్తే, ఆర్మీలో మొత్తం 208 పోస్టులు ఉండగా, అందులో పురుషులకు 198, మహిళలకు 10 పోస్టులు ఉన్నాయి. నేవీలో 42 పోస్టులు (పురుషులు–37, మహిళలు–5), ఎయిర్ ఫోర్స్‌లో మొత్తం 92 పోస్టులు (పురుషులు–90, మహిళలు–2) ఉన్నాయి. అలాగే గ్రౌండ్ డ్యూటీస్ (టెక్నికల్) విభాగంలో 18 పోస్టులు, గ్రౌండ్ డ్యూటీస్ (నాన్-టెక్నికల్) విభాగంలో 10 పోస్టులు ఉన్నాయి. నేవల్ అకాడమీ (10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్) ద్వారా 24 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులన్నింటికీ సంబంధిత విభాగాలను అనుసరించి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత తప్పనిసరి.
అర్హతల విషయానికి వస్తే, అభ్యర్థుల వయస్సు 16½ నుంచి 19½ ఏళ్ల మధ్య ఉండాలి. 2007 జూలై 1కు ముందు, 2010 జూలై 1 తర్వాత జన్మించిన వారు అర్హులు కారు. పురుషుల కనీస ఎత్తు 157 సెం.మీ, మహిళల కనీస ఎత్తు 152 సెం.మీగా నిర్ణయించారు. దరఖాస్తు ఫీజుగా జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.100 చెల్లించాల్సి ఉండగా, ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది. రాత పరీక్ష, ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలంలో నెలకు రూ.56,100 స్టైపెండ్ అందజేస్తారు.
రాత పరీక్ష విధానం ప్రకారం, యూపీఎస్సీ నిర్వహించే ఈ పరీక్షలో మ్యాథమెటిక్స్‌కు 300 మార్కులు, జనరల్ ఎబిలిటీ టెస్ట్‌కు 600 మార్కులు కేటాయించారు. మొత్తం 900 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష ఉంటుంది. నెగటివ్ మార్కింగ్ అమలులో ఉంటుంది. రాత పరీక్ష తేదీ ఏప్రిల్ 12, 2026, ఫలితాలు మే 2026లో విడుదల కానున్నాయి. రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి ఎస్ఎస్బీ ఇంటర్వ్యూలు జూన్ నుంచి జూలై 2026 వరకు నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థులతో ఎన్డీఏ 157వ కోర్సు, ఎన్ఏ 119వ కోర్సులు 2027 జనవరి 1 నుంచి ప్రారంభం కానున్నాయి.