అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సౌదీ అరేబియాకు అత్యాధునిక F-35 స్టెల్త్ యుద్ధవిమానాల విక్రయానికి సూత్రప్రాయంగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా మీడియాతో మాట్లాడిన ట్రంప్ సౌదీ ప్రభుత్వం చాలా సంఖ్యలో ఈ జెట్లను కొనాలనుకుంటోంది. దీనిపై మేము పరిశీలిస్తున్నాం అని వెల్లడించారు.
అమెరికాలో తయారయ్యే F-35లు ప్రపంచంలో అత్యంత సాంకేతికత కలిగిన యుద్ధవిమానాలుగా పరిగణించబడుతుండటంతో, ఈ ఒప్పందం అంతర్జాతీయ రాజకీయంగా కూడా చర్చనీయాంశమైంది. అధికారిక సమాచారం ప్రకారం వచ్చే వారం సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ వైట్‌హౌస్‌కు రావడానికి సిద్ధమవుతున్నారు.
వారి పర్యటన సందర్భంగా పలు ఆర్థిక రక్షణ ఒప్పందాలపై సంతకాలు జరగవచ్చని వాషింగ్టన్ వర్గాలు చెబుతున్నాయి. ఈ మీటింగ్‌ను ట్రంప్ కేవలం సమావేశం కాదు ఇది సౌదీని గౌరవించే సందర్భంగా అభివర్ణించడంతో రెండు దేశాల సంబంధాలు కొత్త దశలోకి అడుగుపెట్టనున్న సూచనలు కనిపిస్తున్నాయి.
ఇదే సమయంలో ట్రంప్ మరో ముఖ్య వ్యాఖ్య కూడా చేశారు. ఇజ్రాయెల్‌తో అమెరికా మధ్య అబ్రహాం అగ్రిమెంట్స్‌లో సౌదీ కూడా త్వరలో చేరాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అయినప్పటికీ రియాద్ ఇప్పటి వరకు పాలస్తీనా సమస్య పరిష్కారంపై స్పష్టమైన రోడ్‌మ్యాప్ లేకుండా ఆ ఒప్పందంపై ముందుకు వెళ్లేందుకు ఆసక్తి చూపలేదు.
ఈ యుద్ధవిమానాల విక్రయం సాఫీగా జరగవచ్చా అనే ప్రశ్నపై పెంటగాన్‌లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. న్యూయార్క్ టైమ్స్ వెల్లడించిన వివరాల ప్రకారం అమెరికా రక్షణ ఇంటెలిజెన్స్ విభాగం ఈ F-35 టెక్నాలజీ చైనా చేతుల్లో పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. సౌదీ–చైనా సంబంధాలు ఇటీవలి కాలంలో బలపడుతున్న నేపథ్యంలో ఈ ఒప్పందం అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాలను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ట్రంప్ ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం ప్రకటించకపోయినా ఈ వ్యాఖ్యలు ప్రపంచ రక్షణ రంగంలో ఇదో పెద్ద మార్పుకు నాంది కావచ్చని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సౌదీకి F-35లు లభిస్తే గల్ఫ్ ప్రాంతం ఆయుధ సమీకరణలో కొత్త సమతుల్యత ఏర్పడే అవకాశం ఉంది. అమెరికా–సౌదీ సంబంధాలు ఇటీవల కొంత ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ ఈ ఒప్పందం ఇద్దరి మధ్య రాజకీయ–భద్రతా సహకారాన్ని తిరిగి బలోపేతం చేసే సూచనలు ఇస్తోంది.