వారణాసి ఈవెంట్‌లో దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారాయి. ఈ ఈవెంట్‌లో ఆయన చెప్పిన మాటలు నెటిజన్ల (ఫైర్)కి కారణమయ్యాయి. అసలు విషయం ఏమిటంటే ఈ కార్యక్రమంలో రాజమౌళి తండ్రి, ప్రముఖ కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, “హనుమాన్ రాజమౌళి వెనుక నిలబడి ఈ సినిమా తీయించాడనుకుంటా” అని సరదాగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య తర్వాత వెంటనే టెక్నికల్ గ్లిచ్ కారణంగా వారణాసి గ్లింప్స్ ఆలస్యం కావడంతో రాజమౌళి మైక్ పట్టుకొని మాట్లాడారు.
నాకు దేవుడిపై పెద్దగా నమ్మకం లేదు. మా నాన్న హనుమాన్ వెనకాల ఉండి నడిపిస్తాడని చెప్పారు. కానీ ఈ వీడియో రాక ఆలస్యం అవుతూనే ఉండడంతో కోపం వచ్చింది. ఇది ఏమిటి? ఇదేనా నడిపించేది అని అనిపించింది” అని రాజమౌళి అన్నారు. ఈ వ్యాఖ్యలు సీరియస్‌గా చెప్పారా? సరదాగా చెప్పారా? అన్న విషయం ఆయన ముఖభావాలతో అర్థం కాలేదు. కానీ ఆ ఒక్క మాట సోషల్ మీడియాలో పేలిన బాంబులా మారింది.
నెటిజన్లు ఈ వ్యాఖ్యలపై ఆగ్రహంతో స్పందిస్తున్నారు. చిన్న టెక్నికల్ సమస్య కోసం దేవుడిని ప్రస్తావిస్తూ ఇలాంటి వ్యాఖ్య చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. “స్టేజ్ మీద ఉన్న పెద్ద దర్శకుడు ఇలాంటి మాటలు మాట్లాడడమేంటిది, క్రెడిట్ అన్నిప్పుడు దేవుళ్లకే ఇస్తారు ఒక్కసారి లేట్ అయిందంటే దేవుడిని నిందించడం సరైన పద్ధతి కాదు, పండుగ టైమ్‌లో, సెంటిమెంట్ ఉన్న సినిమాలో, హనుమాన్ పేరు వింటున్న సమయంలో ఇలాంటి కామెంట్ చేస్తారా?” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
మరోవైపు, కొంతమంది రాజమౌళిని సపోర్ట్ చేస్తూ, “అది ఆయన వ్యక్తిగత నమ్మకం మాత్రమే”, “సరదాగా అన్న మాటను హద్దుమీరి లాగుతున్నారు” అంటూ చెబుతున్నారు. అయినప్పటికీ సోషల్ మీడియాలో విమర్శలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ట్విట్టర్ (X), ఫేస్‌బుక్, యూట్యూబ్ కామెంట్స్ సెక్షన్స్ అన్నీ ఈ విషయం మీదనే చర్చలు కొనసాగుతున్నాయి.
‘వారణాసి’ లాంటి పాన్ ఇండియా మూవీ ఈవెంట్‌లో ఇలాంటి వ్యాఖ్య చేయడం వల్ల పలు వర్గాల నుంచి రాజమౌళిపై విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా హనుమాన్ భక్తులు, సోషల్ మీడియాలోని హిందూ గ్రూపులు ఈ వ్యాఖ్యను తీవ్రంగా తీసుకుని రాజమౌళి క్షమాపణలు చెప్పాలంటూ పోస్టులు చేస్తున్నారు. రాజమౌళి నుంచి ఇంకా ఎలాంటి కౌంటర్ కామెంట్ రాకపోయినా, ఈ విషయం మరింత హీట్ పికప్ అవుతోంది.
మొత్తానికి, ఒక చిన్న టెక్నికల్ ఇష్యూ ఒక సరదా కామెంట్ కానీ సోషల్ మీడియాలో అది పెద్ద వివాదంగా మారిపోయింది. ‘వారణాసి’ ఈవెంట్ గ్రాండ్ అంటోషన్ మధ్య ఈ ఒక్క కామెంట్ మాత్రం ప్రత్యేకంగా కేంద్రబిందువుగా నిలిచింది.