న్యూజిలాండ్ ప్రభుత్వం దేశంలో సీజనల్ ఉద్యోగాల కోసం కార్మికుల కొరత పెరుగుతున్న నేపథ్యంలో రెండు కొత్త సీజనల్ వీసా ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త వీసాల ద్వారా పంటలు కోయడం, హార్టికల్చర్, పాల ఉత్పత్తులు, ఫుడ్ ప్రాసెసింగ్, టూరిజం వంటి రంగాల్లో ప్రతి సంవత్సరం వచ్చే పీక్ సీజన్లలో విదేశీ కార్మికులను చట్టబద్ధంగా తీసుకురావడం సులభం కానుంది.
ఇప్పటికే దరఖాస్తులు ప్రారంభం కావడానికి సిద్ధమైన ఈ రెండు వీసాలు — గ్లోబల్ వర్క్‌ఫోర్స్ సీజనల్ వీసా (GWSV) మరియు పీక్ సీజనల్ వీసా (PSV) — న్యూజిలాండ్‌లో సీజనల్ ఉద్యోగాల రంగానికి పెద్ద ఊతం ఇస్తాయని అక్కడి అధికారులు చెబుతున్నారు.
ఈ రెండు వీసాల లక్ష్యం స్థానికంగా కార్మికులు అందుబాటులో లేని సమయంలో తాత్కాలికంగా విదేశీ సిబ్బందిని ఉపయోగించడం. పంటలు కోయడానికి సమయం వచ్చినప్పుడు లేదా పర్యాటకుల రద్దీ పెరిగే సీజన్‌లో అక్కడి పరిశ్రమలు పెద్ద ఎత్తున సిబ్బందిని అవసరం పడుతుంటాయి. ఈ అవసరాన్ని మెరుగ్గా తీర్చడానికి అలాగే గతంలో వచ్చిన దుర్వినియోగాలను తగ్గించడానికి కొత్త నియమాలతో ఈ వీసాలను ప్రవేశపెడుతున్నారు.
GWSV వీసా ప్రధానంగా అనుభవజ్ఞులైన సీజనల్ వర్కర్ల కోసం రూపొందించబడింది. గత కొంతకాలంలో కనీసం మూడు సీజన్ల అనుభవం ఉన్న విదేశీ కార్మికులు ఈ వీసా కోసం అర్హులవుతారు. ముఖ్యంగా, ఎంప్లాయర్‌కు “లేబర్ మార్కెట్ టెస్ట్” అవసరం లేకపోవడం ఈ వీసా ప్రత్యేకత. అంటే, ముందుగా స్థానికులను ప్రయత్నించామనే నిరూపణ అవసరం ఉండదు.
అభ్యర్థులకు మూడు సంవత్సరాల వరకు సీజనల్‌గా తిరిగి పని చేయడానికి అనుమతి ఉంటుంది. అయితే వారు ప్రతి సంవత్సరం కొన్ని నెలలు దేశం వెలుపల ఉండటం తప్పనిసరి. ఇందువల్ల, నిరంతరం ఒకే చోట ఉండకుండా సీజనల్ ప్రాతిపదికన మాత్రమే పని చేసేలా వ్యవస్థను రూపొందించారు.
మరోవైపు, PSV వీసా పూర్తిగా పీక్ సీజన్ డిమాండ్ ఆధారంగా పనిచేస్తుంది. ఏడాదిలో అత్యంత రద్దీ నెలల్లో ఉద్యోగదాతలు తాత్కాలికంగా అదనపు కార్మికులను తీసుకోడానికి ఈ వీసా ఉపయుక్తం. PSV ద్వారా కార్మికులు గరిష్ఠంగా ఏడునెలల వరకు పని చేయవచ్చు. అయితే ఈ వీసా పొందడానికి ఎంప్లాయర్ తప్పనిసరిగా స్థానికులను ప్రయత్నించిన తర్వాతే విదేశీయులకు ఆఫర్ ఇవ్వాలి. అదనంగా, అభ్యర్థులకు గతంలో కనీసం ఒక సీజన్ అనుభవం ఉండాలి. ఉద్యోగ కాలం మూడు నెలలకు మించి ఉంటే ఆరోగ్య బీమా కూడా తప్పనిసరి.
ఈ రెండు వీసాల వల్ల న్యూజిలాండ్‌లోని వ్యవసాయ, హార్టికల్చర్, పాల పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, టూరిజం రంగాలు సీజనల్ ఒత్తిడిని తగ్గించుకోగలవని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో ఏజెంట్లు తప్పుదారి పట్టించి విదేశీ కార్మికులను మోసం చేసిన వ్యవహారాల నేపథ్యంలో కొత్త వీసాలలో కఠిన నిబంధనలు పెట్టారు. సురక్షితమైన, పారదర్శక నియామక ప్రక్రియ ఉండేలా పలు మార్గదర్శకాలు అమలు చేస్తున్నారు.
భారత్, ఫిలిప్పీన్స్, ఫిజీ, నేపాల్ వంటి దేశాల నుండి ప్రతి సంవత్సరం గణనీయంగా కార్మికులు న్యూజిలాండ్ సీజనల్ ఉద్యోగాల కోసం వెళ్లుతుంటారు. ఇప్పుడు కొత్త వీసాల ప్రకటనతో వారికి మరింత స్పష్టత, భద్రత మరియు చట్టబద్ధ అవకాశాలు లభించనున్నాయి. సీజనల్ ఉద్యోగాల్లో ఇప్పటికే అనుభవం ఉన్నవారికి ఈ అవకాశాలు ముఖ్యంగా లాభకరంగా మారాయి. న్యూజిలాండ్ పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య కార్మికులు అందుబాటులోకి రాగా, విదేశీ కార్మికులకు కూడా సురక్షితమైన తాత్కాలిక ఉపాధి మార్గం ఏర్పడుతోంది.