కాఫీ ఆ పేరులోనే ఒక మధురమైన భావన ఉదయాన్నే ఒక్క కాఫీ తాగితే ఆ రోజంతా మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది. నిజానికి మన ఇంట్లో చేసుకునే కాఫీకి బయట కేఫేల్లో దొరికే కాఫీకి మధ్య ఉన్న తేడా చాలామందికి తెలిసినదే. బయట కాఫీకి ఉన్న సువాసన, మృదుత్వం, రుచి ఇంట్లో ఎందుకు రాదో అని చాలామంది అనుకుంటుంటారు. నిజానికి ఖరీదైన మెషీన్లు లేకపోయినా, ప్రత్యేకమైన బీన్స్ కొనకపోయినా కొన్ని చిన్న మార్పులతోనే మన ఇంట్లో కూడా కేఫే స్థాయి రుచికి దగ్గరగా కాఫీని చేసుకోవచ్చట. కాఫీ తయారీ అనేది కేవలం పొడి వేసి నీరు పోయడం మాత్రమే కాదు, అందులో శ్రద్ధ, సమయం, చిన్న చిట్కాలు ఎంతో కీలకమని ఎంతమందికి తెలుసు అయితే ఇప్పుడు వాసనకి టేస్ట్ కి అద్భుతమైన కాఫీ అలా రెడీ చేసుకోవాలో తెలుసుకుందామా.
మొదటిగా కాఫీ రుచిలో ప్రధాన పాత్ర పోషించేది నీరు చాలామంది సాధారణంగా ట్యాప్ వాటర్ లేదా చాలా గట్టిన నీటితో కాఫీ తయారు చేస్తుంటారు. అయితే నీటి నాణ్యత కాఫీ రుచిని బాగా ప్రభావితం చేస్తుంది. చాలా ఎక్కువ ఉప్పుతనం లేదా వాసన ఉన్న నీరు వాడితే కాఫీ చేదుగా మారుతుంది. సాధ్యమైనంత వరకు శుభ్రమైన, మోస్తరు ఖనిజాలున్న ఫిల్టర్ నీటిని ఉపయోగిస్తే కాఫీ రుచి మెరుగుపడుతుంది. నీరు కాఫీ బీన్స్ లేదా పొడిలోని సువాసనను బాగా బయటకు తీసుకురావడంలో బాగా పనిచేస్తుంది.
తర్వాత కాఫీ పొడి విషయానికి వస్తే, చాలా రోజుల క్రితం కొనుగోలు చేసిన పొడిని వాడటం వల్ల కూడా రుచి తగ్గిపోతుంది. కాఫీ పొడి ఎంత తాజాగుంటే అంత మంచిది. సాధ్యమైతే చిన్న పరిమాణంలో పొడి కొనుగోలు చేసి త్వరగా వినియోగించడం మంచిది. ఇంకా ఒక అడుగు ముందుకెళ్లాలంటే, కాఫీ బీన్స్ కొనుగోలు చేసి అవసరానికి తగ్గట్టు మార్చుకోవడం వలన సువాసన రుచి మరింత పెరుగుతాయి. కేఫేల్లో కాఫీ ప్రత్యేకంగా అనిపించడానికి ఇదే ఒక ముఖ్యమైన కారణం.
కాఫీ తయారీలో ఉష్ణోగ్రత కూడా చాలా ముఖ్యం. మరిగిపోయిన నీటిని నేరుగా కాఫీ పొడిపై పోస్తే, కాఫీ చేదుగా మారే అవకాశం ఉంటుంది. నీరు మరిగిన తర్వాత కొద్దిగా ఆగి, ఆవిరి తగ్గిన తర్వాత వాడితే కాఫీ రుచి సమతుల్యంగా ఉంటుంది. చాలా మంది ఈ చిన్న విషయాన్ని పట్టించుకోరు. కానీ కేఫేల్లో మాత్రం నీటి ఉష్ణోగ్రతను చాలా జాగ్రత్తగా నియంత్రిస్తారు.
పాలు వాడే అలవాటు ఉన్నవారికి మరో ముఖ్యమైన విషయం ఉంది. పాలను ఎక్కువసేపు మరిగిస్తే వాటిలో సహజమైన తీపి తగ్గిపోతుంది. కాఫీ కోసం పాలను మోస్తరు వేడి వరకు మాత్రమే వేడి చేయడం మంచిది. పాలు కాస్త నురగ వచ్చేలా చేస్తే, కాఫీకి మృదువైన టెక్స్చర్ వస్తుంది. ఇంట్లో చిన్న విస్క్ లేదా మిక్సర్ ఉపయోగించి పాలను కాస్త ఫ్రోత్ చేయవచ్చు.
చివరిగా చిన్న కానీ ప్రభావవంతమైన చిట్కా ఏమిటంటే, కాఫీకి చిన్న రుచుల మలుపు ఇవ్వడం. చిటికెడు దాల్చిన చెక్క పొడి, కోకో పౌడర్ కాఫీకి కొత్త రుచి వస్తుంది. ఇవన్నీ ఎక్కువగా వేసే అవసరం లేదు, కేవలం స్వల్పంగా కలిపితే సరిపోతుంది. ఇలా చిన్న ప్రయోగాలు చేస్తే ప్రతిరోజూ ఒకేలా కాకుండా కొత్త అనుభూతితో కాఫీ ఆస్వాదించవచ్చు.
మొత్తానికి కేఫే స్థాయి కాఫీ కోసం ఖరీదైన పరికరాలు తప్పనిసరి కాదు. నీటి నాణ్యత, కాఫీ పొడి తాజాదనం, సరైన ఉష్ణోగ్రత, పాలను వేడి చేసే విధానం, చిన్న రుచి చిట్కాలు ఇవన్నీ కలిస్తే ఇంట్లోనే మంచి కాఫీ సాధ్యమవుతుంది. కొద్దిగా శ్రద్ధ పెట్టి ఈ మార్పులు చేస్తే, ఉదయపు కాఫీ కప్పు మరింత ప్రత్యేకంగా మారుతుందని చెప్పొచ్చు.