నూతన సంవత్సరం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్‌దారులకు శుభవార్త చెప్పింది. ఎన్టీఆర్ భరోసా పథకం కింద జనవరి నెలకు సంబంధించిన పింఛన్‌ను ఒక రోజు ముందుగానే పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు డిసెంబర్ 31వ తేదీనే లబ్ధిదారులకు పింఛన్ డబ్బులు అందజేయనున్నారు.
సాధారణంగా ప్రతి నెలా 1వ తేదీన పింఛన్లు పంపిణీ చేస్తుంటారు. అయితే జనవరి 1వ తేదీ న్యూ ఇయర్ సెలవు కావడంతో, పింఛన్ పంపిణీని ముందుకు జరిపి డిసెంబర్ 31న ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ఏడాదిలో కూడా ఇదే విధంగా ఒకరోజు ముందుగానే పింఛన్లు అందజేసిన సంగతి తెలిసిందే.
పింఛన్ పంపిణీ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు డిసెంబర్ 30వ తేదీనే బ్యాంకుల నుంచి నగదు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు జిల్లా డీఆర్డీఏ పీడీలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం సూచించింది. ఏవైనా కారణాలతో మిగిలిపోయిన పింఛన్లను జనవరి 2న పంపిణీ చేయనున్నారు.
ఈ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది పింఛన్‌దారులు నూతన సంవత్సరాన్ని ఆనందంగా ప్రారంభించనున్నారు. ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఈ ముందస్తు పింఛన్ ఆర్థికంగా ఊరటనిచ్చే నిర్ణయంగా మారింది.
ఇక మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. 2026 జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు లైఫ్ సర్టిఫికెట్ తప్పనిసరిగా సమర్పించాలని ఆదేశించింది. జీవన్ ప్రామాన్ యాప్, జీవన్ ప్రామాన్ ఫేస్ యాప్ లేదా సంబంధిత ఉప ఖజానా కార్యాలయంలో ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. ఆరోగ్య సమస్యలు ఉన్న లేదా మంచానికే పరిమితమైన పెన్షనర్లకు ఖజానా సిబ్బంది ఇంటికే వెళ్లి లైఫ్ సర్టిఫికెట్ ధృవీకరిస్తారని ప్రభుత్వం స్పష్టం చేసింది.