హిమాలయ దేశం నేపాల్‌లో యువత ఆగ్రహం ఉధృతమైంది. సోషల్ మీడియాలో ప్రభుత్వం విధించిన నిషేధం దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీసింది. మొదట సామాజిక మాధ్యమాల ఆంక్షలపై మొదలైన ఆందోళనలు, క్రమంగా అవినీతి వ్యతిరేక ఉద్యమంగా మారి హింసాత్మకంగా మారిపోయాయి. ఈ పరిణామాల మధ్య ప్రధాని కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేశారు.
రెండు రోజులుగా జరిగిన ఘర్షణల్లో 19 మంది మృతి చెందగా, 400 మందికి పైగా గాయపడ్డారు. ఖాట్మండు వీధులు యుద్ధరంగంలా మారాయి. నిరసనకారులు పార్లమెంట్, ప్రధాని ఓలీ మరియు అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ నివాసాలపై దాడి చేసి, వాహనాలు, ప్రభుత్వ భవనాలకు నిప్పుపెట్టారు. పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణలు తీవ్రరూపం దాల్చాయి.

ప్రభుత్వం సోషల్ మీడియా నిషేధాన్ని వెనక్కి తీసుకున్నా, యువత వెనక్కి తగ్గలేదు. ‘సోషల్ మీడియా బ్యాన్ ఆపండి, అవినీతి ఆపండి’ నినాదాలతో ఉద్యమం కొనసాగింది. అధికారంలో ఉన్నవారి పిల్లలకు అన్యాయంగా అవకాశాలు లభిస్తున్నాయంటూ #NepoBabies హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో ప్రభుత్వం ఎదురుదెబ్బతిన్నది.
పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో త్రిభువన్ విమానాశ్రయాన్ని మూసివేసి, సైన్యాన్ని రంగంలోకి దించారు. ప్రధాని రాజీనామా చేసినా రాజకీయ అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. అధ్యక్షుడి ఆధ్వర్యంలో ప్రభుత్వం కొనసాగుతున్నా, అది కూడా కూలిపోవచ్చన్న అంచనాలు ఉన్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు సైనిక పాలనకు అవకాశం ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.