భారత్ ప్రధాని నరేంద్ర మోదీ మరియు ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది మధ్య విభేదాలు తలెత్తినట్టు పాకిస్థాన్ ఆధారిత సోషల్ మీడియా ఖాతాలు ప్రచారం చేస్తున్నట్లు వార్తలు రావడంతో కేంద్ర ప్రభుత్వం సరికొత్త స్పష్టత ఇచ్చింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ విభాగం ఈ ప్రచారం పూర్తిగా కల్పితమని, ప్రజలను తప్పుదారి పట్టించడానికి పాకిస్థాన్ చేస్తున్న కుట్రలో భాగం మాత్రమే అని ప్రకటించింది.
కొన్ని సోషల్ మీడియా ఖాతాల్లో, ముఖ్యంగా ‘ఎక్స్’లో, భారత సైన్యం పాకిస్థాన్‌తో తలపడే స్థితిలోలేదని, సైన్యంలో అసంతృప్తి ఉందని తప్పుడు వార్తలు వ్యాప్తి చెందాయి. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఇవన్నీ పాకిస్థాన్ నుంచి నడిపిస్తున్న దుష్ప్రచారమని గుర్తించి వెంటనే నిజం బయట పెట్టింది. భారత ప్రభుత్వం–సైన్యం మధ్య విభేదాలు ఉన్నట్లుగా చూపించడమే ఈ అబద్ధపు ప్రచార లక్ష్యం.

గతంలో 'ఆపరేషన్ సిందూర్' సందర్భంలో కూడా పాకిస్థాన్ ఇలాంటి అసత్య ప్రచారాలకు పాల్పడినట్టు పీఐబీ గుర్తు చేసింది. ఇప్పటికీ అదే పద్ధతిలో misinformation ను వ్యాప్తి చేస్తున్నారని అధికారులు హెచ్చరించారు. సోషల్ మీడియా వేదికలలో వ్యాప్తి చెందుతున్న ఇలాంటి నిరాధార సమాచారాన్ని నమ్మవద్దని, సక్రమమైన మరియు అధికారిక వనరులను మాత్రమే విశ్వసించాలని పీఐబీ సూచించింది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, దేశ భద్రతకు సంబంధించిన విషయాల్లో గందరగోళం కలిగించే ప్రయత్నాలను లైట్‌గా తీసుకోవద్దని పీఐబీ తెలిపింది. దేశ ఐక్యత, సైన్యం ప్రతిష్టకు హాని చేసే తప్పుడు ప్రచారాలను పక్కన పెట్టి, నిజమైన సమాచారం కోసం అధికారిక వనరులనే ఆశ్రయించాలని సూచించింది.