తిరుపతిలో కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌పై రైల్వే బోర్డు స్పష్టత ఇచ్చింది. ఈ విషయంపై రైల్వే బోర్డు ఛైర్మన్ సతీష్, తిరుపతి ఎంపీ ఎం. గురుమూర్తికి లేఖ రాసారు. తిరుపతిలో రైల్వే డివిజన్ ఏర్పాటు ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యపడదని స్పష్టం చేశారు. ఫీజిబిలిటీ లేనందున, గతంలో ఏర్పాటు చేసిన కమిటీలూ ఇందుకు అనుకూలంగా ఎలాంటి సిఫార్సులు చేయలేదని పేర్కొన్నారు.
అయితే తిరుపతిలో ‘బాలాజీ రైల్వే డివిజన్’ పేరిట డివిజన్ ఏర్పాటుకు స్థానికులు, ప్రజాప్రతినిధులు గట్టి డిమాండ్ చేస్తుండటం తెలిసిందే. తిరుపతి ఆధ్యాత్మిక కేంద్రమైనదే కాకుండా చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు సమాన దూరంలో ఉండటంతో పెద్ద ఎత్తున ప్రయాణికులు ఇక్కడి రైల్వేస్టేషన్‌ను వినియోగిస్తున్నారు. నిత్యం 50-60 రైళ్లు బయలుదేరడం, చేరడం జరుగుతుండగా, మరో 50 రైళ్లు హాల్ట్ పొందుతున్నాయి. ప్రస్తుతం 300 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. దక్షిణ దిశగా కొత్త భవనం నిర్మాణంతో పాటు, కార్ పార్కింగ్ వసతులు కల్పిస్తున్నారు.
2022 మేలో ప్రారంభమైన ఈ అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తిచేయాలన్న లక్ష్యంతో సాగుతున్నాయి. ప్రజల డిమాండ్లను దృష్టిలో పెట్టుకొని తిరుపతిని రైల్వే డివిజన్‌గా గుర్తించాలని ఎంపీలు ఇప్పటికే పార్లమెంటులో అనేకసార్లు ప్రస్తావించారు.