యూరోపియన్ యూనియన్ (EU) రష్యా చమురుపై విధించిన ఆంక్షలు ఇప్పుడు భారతీయ షిప్పింగ్ రంగంపైనా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన 'ఇంటర్‌షిప్పింగ్ సర్వీసెస్ హబ్' అనే సంస్థ భారతీయ విభాగం ఈ ఆంక్షల వల్ల ప్రభావితమవుతోంది. అంతేకాదు, అదే కంపెనీలో పనిచేస్తున్న భారతీయ నౌకా కెప్టెన్ అభినవ్ కమల్‌కు సైతం ఈ ఆంక్షలు చుక్కెదురవుతున్నాయి.
కెప్టెన్ అభినవ్ కమల్ రష్యన్ క్రూడ్ ఆయిల్ మరియు పెట్రోలియం ఉత్పత్తుల రవాణాకు సంబంధించి మెటీరియల్, సాంకేతిక, ఆర్థిక సహాయం అందించారని ఈయూ ఆరోపిస్తోంది. దీంతో యూరోపియన్ యూనియన్ ఆంక్షలు ఎదుర్కొంటున్న తొలి భారతీయ పౌరుడిగా అభినవ్ గుర్తింపు పొందారు.
ఇక, ఇంటర్‌షిప్పింగ్ సంస్థ రష్యన్ వ్యాపార కార్యకలాపాల్లో పాల్గొన్న నౌకలకు సహాయం అందించిందన్న ఆరోపణలతో ఈయూ ఆ కంపెనీని కూడా టార్గెట్ చేసింది. అధికారికంగా ఈయూ అనుబంధ దేశాల్లో కెప్టెన్ కమల్‌కు సేవలు ఇవ్వడం, తీసుకోవడం ఇక సాధ్యం కాదు. అంతర్జాతీయ షిప్పింగ్ రంగంలో ఈయూ కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో ఆయన భవిష్యత్‌పై అనేక అనిశ్చితులు నెలకొన్నాయి.
మరోవైపు, ఈ ప్రభావం నయారా ఎనర్జీ లిమిటెడ్ అనే భారతీయ రిఫైనరీపై కూడా కనిపిస్తోంది. ఈ కంపెనీలో రష్యాకు చెందిన రోస్‌నెఫ్ట్‌కు 49.13 శాతం వాటా ఉంది. ఈయూ ఆంక్షల నేపథ్యంలో షిప్పింగ్ ఆపరేటర్లు నయారా కంపెనీతో వ్యవహరించడాన్ని నిరాకరిస్తుండటంతో, కొన్ని రవాణాలు నిలిచిపోయాయి. అయినప్పటికీ, భారత్ ఇతర దేశాలు విధిస్తున్న ఏకపక్ష ఆంక్షలను అమోదించదన్న దానిలో ఇప్పటికీ స్పష్టంగా నిలబడి ఉంది.