లక్నో నుంచి ఢిల్లీ బయలుదేరిన విమానం చివరి నిమిషంలో పెద్ద ప్రమాదాన్ని తప్పించుకుంది. ఈ ఘటనలో ప్రయాణికులందరూ ఒక క్షణం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయాందోళనకు గురయ్యారు. విమానం టేకాఫ్ కోసం రన్‌వే మీద పరిగెడుతుండగా అకస్మాత్తుగా సాంకేతిక సమస్య తలెత్తినట్లు సమాచారం. పైలెట్ వెంటనే అప్రమత్తమై, ఆ విమానాన్ని టేకాఫ్ చేయకుండా ఆపేయడం వల్ల ఒక పెద్ద ప్రమాదం తప్పింది. సమయస్ఫూర్తితో తీసుకున్న ఈ నిర్ణయం వందలాది ప్రాణాలను రక్షించిందని నిపుణులు అంటున్నారు.
ఈ విమానంలో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్‌తో పాటు మొత్తం 151 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో చాలా మంది ఢిల్లీలో అత్యవసర పనుల కోసం బయలుదేరగా, కొంతమంది కుటుంబ సభ్యులను కలవడానికి వెళ్తున్నారు. ఒక్కసారిగా విమానం ఆగిపోవడంతో ప్రయాణికులు అరుస్తూ భయాందోళనకు గురయ్యారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే పైలెట్ చాకచక్యంతో విమానం సురక్షితంగా నిలిపివేయడంతో ఎవరికి ఎలాంటి గాయాలు కాని, ప్రాణనష్టం కాని జరగలేదు.
నిపుణులు చెబుతున్న ప్రకారం, పైలెట్ సమయానికి తీసుకున్న ఈ నిర్ణయం మంచిది అయ్యింది లేకపోతే అహ్మదాబాద్‌లో జరిగిన గత విమాన ప్రమాదం తరహాలో దుర్ఘటన జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. విమానం టేకాఫ్ అయ్యి ఉంటే ఆకాశంలో పెద్ద ప్రమాదం తప్పదని, రన్‌వే వద్దే నిలిపేయడం వల్ల అనూహ్యమైన ప్రమాదాన్ని నివారించగలిగారని విశ్లేషిస్తున్నారు.
ఈ ఘటనతో విమానాశ్రయంలో ఒకింత కలకలం రేగింది. ప్రయాణికుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందగా, ఎయిర్‌లైన్ అధికారులు వెంటనే వారిని అప్రమత్తం చేశారు. సాంకేతిక లోపం ఏమిటన్న దానిపై దర్యాప్తు ప్రారంభమైంది. మెకానికల్ సమస్యనా, లేక మరేదైనా కారణమా అన్నదానిపై నిపుణుల బృందం సమగ్రంగా పరిశీలిస్తోంది.
ప్రస్తుతం ఈ ఘటనపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. విమానయానంలో భద్రతా ప్రమాణాలు ఎంత కఠినంగా ఉన్నప్పటికీ, అప్పుడప్పుడూ జరిగే ఇలాంటి ఘటనలు ప్రయాణికులలో భయాన్ని కలిగిస్తాయి. అయితే పైలెట్ల అప్రమత్తత, శిక్షణ స్థాయులు ఎంత బలంగా ఉన్నాయో ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. ప్రయాణికులు పైలెట్‌ను హీరోలా అభివర్ణిస్తూ ధన్యవాదాలు తెలిపారు.