రాష్ట్రంలో జరుగుతున్న సుపరిపాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. వైకాపా హయాంలో ప్రజలు బాగా విసిగిపోయారని, ఏదైనా సమస్య చెప్పుకోవాలంటే భయపడే పరిస్థితి ఉండేదని తెలిపారు.
మరోసారి వైకాపాకు అధికారం ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా లేరని చెప్పారు. పెనమలూరు నియోజకవర్గంలోని కంకిపాడులో శనివారం ఆయన పర్యటించారు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజల స్పందన ఎలా ఉందని ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడారు.
సీఎం చంద్రబాబు అహర్నిశలు శ్రమించి, నిధులు సమకూర్చి రాష్ట్రాన్ని అభివృద్ధివైపు తీసుకెళ్తున్నారన్నారు. ఎన్ఆస్ఈజీఎస్ (నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్) నిధులను రహదారుల అభివృద్ధికి వినియోగించినట్లు పేర్కొన్నారు. సుమారు 90 శాతం రహదారులను పూర్తి చేసినట్లు వెల్లడించారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు కూటమి నాయకులు, కార్యకర్తలు ఇప్పటినుంచే సన్నద్ధం కావాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను విస్తృతస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. కార్యక్రమంలో ఏఎంసీ అధ్యక్షుడు కొండ ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.