తెలంగాణ రాష్ట్రం మీదుగా మూడు హైస్పీడ్ రైలు మార్గాలు ఏర్పాటు కానున్నాయి. హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు, అమరావతి వరకు ఈ ప్రాజెక్టులు ఉండనున్నాయి. ఇందులో హైదరాబాద్–చెన్నై, హైదరాబాద్–బెంగళూరు రూట్లకు ఇప్పటికే ప్రాథమిక అలైన్‌మెంట్లు ఖరారయ్యాయి. హైదరాబాద్–అమరావతి రూట్‌పై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి.
హైదరాబాద్–చెన్నై రూట్ కోసం మూడు వేరువేరు అలైన్‌మెంట్లు సిద్ధం చేశారు. ఇందులో తెలంగాణలో 6-7 స్టేషన్లు ఉండే అవకాశం ఉంది. ఈ రూట్ కాజీపేట కాకుండా నార్కట్‌పల్లి, సూర్యాపేట, కోదాడ మీదుగా వెళ్ళనుంది. హైదరాబాద్–బెంగళూరు రూట్‌ను నాగపూర్–హైదరాబాద్–బెంగళూరు గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేకు సమాంతరంగా నిర్మించనున్నారు. ఇందులో కూడా 4-5 స్టేషన్లు ఉండవచ్చని అంచనా.
హైదరాబాద్–అమరావతి రూట్‌ను గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేకు సమాంతరంగా నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మార్గాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో రైల్వే ఇంజినీర్లు, రాష్ట్ర అధికారులు కూడా పాల్గొనబోతున్నారు.
హైస్పీడ్ రైళ్లతో పాటు రీజనల్ రింగ్ రోడ్ పక్కనే రైల్వే లైన్‌ను కూడా ప్రతిపాదించారు. ముందుగా ఇది 3-14 కిలోమీటర్ల దూరంలో ఉండాలని భావించారు. కానీ ప్రయాణికుల సౌకర్యం కోసం రీజనల్ రోడ్డుకి పక్కనే రైల్వే లైన్ వేసేలా కొత్త అలైన్‌మెంట్‌ను రూపొందించారు. దీనికి కావలసిన భూమి కోసం రైల్వే అధికారులు ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరిపారు.
ఈ ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణలో రవాణా వ్యవస్థ మరింత ఆధునీకరణ అవుతుంది. హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు, అమరావతి నగరాలకు కనెక్టివిటీ వేగంగా పెరుగుతుంది. అదేవిధంగా ఆర్థిక, వ్యాపార అవకాశాలు విస్తరిస్తాయి. రీజనల్ రింగ్ రైలు కూడా నగర రవాణాకు పెద్ద సాయం అవుతుంది.