రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుంచి ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్. దేశవ్యాప్తంగా ఉన్న బ్రాంచ్‌లలో ఒప్పంద ప్రాతిపదికన మెడికల్ కన్సల్టెంట్ పోస్టులతో పాటు, 120 గ్రేడ్ బీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 30, 2025 సాయంత్రం 6 గంటల వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ నోటిఫికేషన్ కింద గ్రేడ్ బీ ఆఫీసర్ పోస్టులు మూడు విభాగాల్లో ఉన్నాయి. జనరల్ స్ట్రీమ్‌లో 83 పోస్టులు, ఎకనామిక్స్ అండ్ పాలసీ రీసెర్చ్ (DEPR) విభాగంలో 17 పోస్టులు, స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ (DSIM) విభాగంలో 20 పోస్టులు భర్తీ కానున్నాయి. ప్రతి విభాగానికి ప్రత్యేక అర్హతలు ఉండగా, జనరల్ స్ట్రీమ్‌కు డిగ్రీ లేదా పీజీ అర్హత తప్పనిసరి. DEPR స్ట్రీమ్‌కు ఎకనామిక్స్, ఫైనాన్స్‌లో మాస్టర్స్, DSIM స్ట్రీమ్‌కు స్టాటిస్టిక్స్ లేదా సంబంధిత విభాగంలో పీజీ చేసిన వారు అర్హులు.
దరఖాస్తుదారుల వయసు జూలై 1, 2025 నాటికి 21 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంఫిల్ లేదా పీహెచ్‌డీ పూర్తి చేసిన వారికి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. దరఖాస్తు రుసుము జనరల్/ఓబీసీ అభ్యర్థులకు రూ.850గా, SC/ST/PwBD అభ్యర్థులకు రూ.100గా నిర్ణయించారు. ఎంపిక ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ పరీక్షల ఆధారంగా జరుగుతుంది. ఎంపికైన వారికి నెలకు రూ.78,450 వరకు జీతం లభిస్తుంది.
పరీక్షల షెడ్యూల్‌ను కూడా RBI ప్రకటించింది. అక్టోబర్ 18న గ్రేడ్ బీ జనరల్ పోస్టులకు ఫేజ్-I ఆన్‌లైన్ పరీక్ష, అక్టోబర్ 19న DEPR, DSIM విభాగాలకు ఫేజ్-I పరీక్షలు నిర్వహించనున్నారు. ఫేజ్-II పరీక్షలు డిసెంబర్ 6న జరుగుతాయి. ఈ ఉద్యోగాలు పొందేందుకు అభ్యర్థులు సమగ్ర సన్నద్ధతతో పరీక్షలకు హాజరవ్వాలని అధికారులు సూచిస్తున్నారు.