థాయ్లాండ్-కంబోడియాల మధ్య మరోసారి ఘర్షణ చెలరేగే పరిస్థితి తలెత్తింది. ఇరుదేశాల మధ్య ఒప్పందం జరిగి 24 గంటలైనా పూర్తికాక ముందే కవ్వింపు చర్యలు మొదలయ్యాయి. కంబోడియా దళాలు ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయని థాయ్లాండ్ ఆరోపించింది.
ఇప్పటికే ఇరుదేశాల మధ్య ఐదు రోజుల పాటు జరిగిన సైనిక ఘర్షణల్లో ఇప్పటివరకు 33 మంది ప్రాణాలు కోల్పోగా.. వేల మంది నిర్వాసితులయ్యారు. సోమవారం నుంచి కాల్పుల ఒప్పందం అమలు మొదలైనా ఆదిలోనే మళ్లీ సమస్యలు తలెత్తాయి.
అర్ధరాత్రి నుంచి తాము కాల్పులు జరపడం ఆపేశామని థాయ్ మిలిటరీ చెబుతోంది. కానీ, కంబోడియా పక్షం నుంచి మాత్రం కాల్పులు ఆగలేదని ఆరోపించింది. సరిహద్దు వెంట చాలా ప్రదేశాల్లో రాత్రి మొత్తం కాల్పులు జరిగినట్లు వెల్లడించింది.
వీటికి తగిన స్థాయిలో థాయ్ నుంచి కూడా ప్రతిస్పందనలు వెళ్లినట్లు పేర్కొన్నారు. ఈవిషయాన్ని థాయ్ ప్రతినిధి వింథాయ్ సువారే వెల్లడించారు. మరోవైపు కంబోడియా రక్షణ మంత్రి ఓ ఆంగ్ల వార్తాసంస్థతో మాట్లాడుతూ.. కాల్పుల విరమణ మొదలైప్పటినుంచి ఇరుపక్షాల నుంచి ఎక్కడా సాయుధ ఘర్షణలు చోటుచేసుకోలేదని వివరణ ఇచ్చారు.
ఇక కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా జరగాల్సిన స్థానిక కమాండర్ల సమావేశం కూడా రెండుసార్లు వాయిదా పడటం గమనార్హం. సోమవారం థాయ్లాండ్- కంబోడియాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. కంబోడియా ప్రధాని హున్మానేట్, థాయ్ తాత్కాలిక ప్రధాని పుమామ్ వెచాయచాట్లు షరతుల్లేని తక్షణం పరస్పర దాడులను ఆపేసేలా అంగీకరించారు.
ఈ విషయాన్ని మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం సోమవారం పుత్రజయలో విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో వెల్లడించారు. "సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరుదేశాల సైనికాధికారులు సమావేశాలు నిర్వహిస్తారు.
కాల్పుల విరమణను అమలుచేసి, శాంతిభద్రతలను పర్యవేక్షించేందుకు మలేసియా, థాయ్, కంబోడియాల విదేశాంగ, రక్షణశాఖలు ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి” అని అన్వర్ వెల్లడించారు.
చర్చల అనంతరం జరిగిన విలేకరుల సమావేశాన్ని థాయ్- కంబోడియా నేతలు కరచాలనంతో ముగించారు. రెండు గంటలకు పైగా జరిగిన ఈ చర్చలకు చైనా, అమెరికా రాయబారులు హాజరయ్యారు.