లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ జంటగా నటిస్తున్న కొత్త సినిమా ‘సతీ లీలావతి’ ఆసక్తికరంగా రూపుదిద్దుకుంటోంది. ‘భీమిలీ కబడ్డీ జట్టు’, ‘శివ మనసులో శృతి (ఎస్‌ఎంఎస్)’ చిత్రాలతో గుర్తింపు పొందిన తాతినేని సత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా చిత్ర బృందం టీజర్‌ను విడుదల చేసింది.
భర్తా-భార్యల మధ్య ఉండే భావోద్వేగ బంధాన్ని హాస్యంతో కలిపి చూపించిన టీజర్, ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో కనిపించే ట్రెండీ డైలాగులు, సరదా పంచ్‌లు టీజర్‌ను ఫన్నీగా తీర్చిదిద్దాయి. లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ మధ్య తలెత్తే చిన్నచిన్న గొడవల దృశ్యాలు హైలైట్‌గా నిలిచాయి. పెళ్లి తర్వాత లావణ్య నటించిన తొలి సినిమా ఇదే కావడం విశేషం.
నరేశ్, వి.టి.వి. గణేశ్, సప్తగిరి, జాఫర్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై నాగ మోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం మిక్కీ జే మేయర్ అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాక మేకర్స్ త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.