లీచ్ టెన్‌స్టెయిన్ (Liechtenstein) అనే యూరోపియన్ చిన్న దేశం ఇటీవల సోషల్ మీడియా ద్వారా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఈ దేశానికి తమదైన ఎయిర్‌పోర్ట్ లేదు, తమదైన కరెన్సీ లేదు, అధికారిక భాష కూడా జర్మన్‌ను అద్దెకి తీసుకున్నారు. అయినా ఇది ప్రపంచంలో అత్యంత సంపన్న దేశాల్లో ఒకటిగా నిలిచింది. స్విట్జర్లాండ్, ఆస్ట్రియాల మధ్యలో పర్వతాల మధ్య ఒదిగిపోయిన ఈ దేశం తన అందం, శాంతియుత జీవనవిధానం వల్ల "స్వర్గధామం"గా గుర్తింపు పొందింది.
లీచ్ టెన్‌స్టెయిన్ జనాభా కేవలం 30,000 మాత్రమే. దేశవ్యాప్తంగా ఉన్న జైల్లో ఖైదీలు కేవలం 7 మందే. రాత్రిపూట తలుపులు తాళాలు వేయకుండా ప్రజలు నిద్రపోతారు. చట్టాలపై విశ్వాసం, పరస్పర గౌరవం, తక్కువ పన్నులు, బయటి అప్పులేమీ లేకపోవడం వంటివి అక్కడి ప్రజల జీవితం ప్రశాంతంగా, ఆర్థికంగా బలంగా ఉంచాయి. ప్రజలందరికీ తగిన ఆదాయం ఉండటం వల్ల పనివత్తిడిలేకుండా తమ హాబీలను ఆస్వాదించే అవకాశం కలుగుతుంది.
ఈ దేశం గురించి ఒక వీడియో ఇటీవల Instagramలో వైరల్‌గా మారింది. అందులో "మీకు గొప్పగా కనిపించాల్సిన అవసరం లేదు, చిన్నదైన దేశం కూడా గొప్పగా ఎదగవచ్చు" అనే సందేశం ఉన్నది. దీనిపై నెటిజన్ల నుంచి భారీ స్పందన వచ్చింది. చాలా మంది "ఇదే నిజమైన జీవితం కావాలి" అని కామెంట్ చేశారు. కొందరైతే రిటైర్మెంట్ తర్వాత ఈ దేశానికి వెళ్లాలని కూడా అభిప్రాయపడ్డారు.
ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకూ ఇది ఒక మంచి ఉదాహరణ. వనరుల పరిమితి ఉన్నా సరే, పరిపూర్ణ జీవితం గడపవచ్చునని లిక్టెన్‌స్టెయిన్ నిరూపిస్తోంది. క్రైం లేని సమాజం, ఆదాయ సమానత, భద్రతతో కూడిన జీవితానికి ఇది సజీవ ఉదాహరణగా నిలుస్తోంది.