ఇండియాలో అతిపెద్ద లో కాస్ట్ ఎయిర్‌లైన్ అయిన ఇండిగో (6E) గత రెండు సంవత్సరాల్లో 1,000 మందికి పైగా కొత్త పైలట్లను నియమించుకుంది. ప్రస్తుతం ఇండిగో వద్ద 5,456 పైలట్లు ఉన్నారు. ఇది ఎయిర్ ఇండియా (AI) మరియు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ (IX) కలిపి ఉన్న 5,449 పైలట్ల కంటే ఎక్కువగా ఉంది. ఇది ఇండిగో డొమెస్టిక్ మరియు ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ఆధిపత్యాన్ని చూపిస్తోంది.
ఈ నియామకాలతోపాటు ఇండిగో తన విమానాల నెంబరును 434కి పెంచింది. ప్రయాణికుల డిమాండ్ పెరుగుతుండటంతో కొత్త విమానాలు, కొత్త పైలట్లు అవసరమవుతున్నారు. అకాసా ఎయిర్ లాంటి విమాన సంస్థలు పైలట్లు రాజీనామా చేయడం వల్ల రద్దైన ఫ్లైట్ల సమస్యలను ఎదుర్కొన్నా ఇండిగో మాత్రం ముందస్తుగా ఏర్పాట్లు చేసుకొని బలంగా నిలిచింది.
ఇండియాలో FY25 నాటికి దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 165 మిలియన్లకు చేరింది. ఇది COVID ముందు అయిన FY20లో ఉన్న 141 మిలియన్లతో పోలిస్తే 17% వృద్ధిని సూచిస్తోంది. అంతర్జాతీయ ప్రయాణాలు కూడా 49% పెరిగాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇండిగో ఇప్పటికే 920కి పైగా కొత్త విమానాల ఆర్డర్ వేసింది. ఇందులో A321XLRలు (FY26) మరియు A350లు (FY27) ఉన్నాయి.
ఇండిగో లింగ సమానత్వానికి కూడా పెద్ద ప్రాధాన్యత ఇస్తోంది. ప్రస్తుతం ఇండిగోలో 16% పైలట్లు మహిళలే. ఇది గ్లోబల్ అవరేజ్ కన్నా మూడు రెట్లు ఎక్కువ. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని 77 మహిళా పైలట్లను జాబితాలో చేర్చింది. FY25లో ఇండిగో లాభంగా ₹7,258 కోట్ల ఆదాయాన్ని నమోదు చేయగా ఎయిర్ ఇండియా ₹10,859 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. 2034 నాటికి ఇండియాకు 21,500 పైలట్ల అవసరం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.