తమ వాహనాలకు ఫ్యాన్సీ నంబర్లు తీసుకోవాలనుకునే వారికి తెలంగాణ రవాణా శాఖ భారీ షాక్ ఇచ్చింది. ఇప్పటివరకు ఉన్న ధరలను మూడు రెట్లు పెంచుతూ కొత్త ప్రాథమిక ధరలను ప్రకటించింది. ఇప్పటివరకు రూ.50 వేలుగా ఉన్న 9999 నంబర్ ధరను రూ.1.50 లక్షలకు పెంచగా, రూ.30 వేలుగా ఉన్న 6666 నంబర్ ధరను రూ.1 లక్షగా నిర్ణయించారు. వేలంలో ఎవరు ఎక్కువ ధర చెప్పినా ఆ నంబర్ వారికే కేటాయిస్తారు.
ఇప్పటివరకు ఐదు స్లాబుల్లో ఉన్న ఫ్యాన్సీ నంబర్లను ఏడు స్లాబులుగా విస్తరించారు. కొత్త ధరల ప్రకారం రూ.1.50 లక్షలు, రూ.1 లక్ష, రూ.50 వేలు, రూ.40 వేలు, రూ.30 వేలు, రూ.20 వేలు, రూ.6 వేలుగా నిర్ణయించారు. ఈ ధరల పెంపుతో రవాణా శాఖకు వచ్చే ఏడాదిలోనే రూ.100 కోట్లకు పైగా అదనపు ఆదాయం వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల కాగా, ప్రజల అభ్యంతరాలు, సూచనల తర్వాత పూర్తి నోటిఫికేషన్ జారీ కానుంది.