న్యూఢిల్లీలోని అఫ్గానిస్థాన్ ఎంబసీ వద్ద జరిగిన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీసింది. అఫ్గానిస్థాన్ తాత్కాలిక తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ భారత పర్యటనలో భాగంగా గురువారం నాడు న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.
అయితే ఆ ప్రెస్ మీట్‌కు మహిళా జర్నలిస్టులను అనుమతించలేదనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై రాజకీయ నాయకులు తీవ్రంగా స్పందించారు.
మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పీ. చిదంబరం ఈ ఘటనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మహిళా జర్నలిస్టులను ప్రెస్ కాన్ఫరెన్స్ నుంచి తప్పించడం చాలా షాకింగ్ ఉంది ఆ సమయంలో పురుష జర్నలిస్టులు కూడా నిరసనగా బయటకు రావాలి అని ఆయన X (ట్విట్టర్) లో రాశారు.
తృణమూల్ కాంగ్రెస్ నేత మహువా మోయిత్రా కూడా తీవ్రంగా స్పందించారు. “భారత భూభాగంలో తాలిబాన్ విదేశాంగ మంత్రి మహిళా జర్నలిస్టులను ఎందుకు నిషేధించాడు? ఆ కార్యక్రమానికి భారత ప్రభుత్వం, ముఖ్యంగా విదేశాంగ మంత్రి జైశంకర్ ఎలా అనుమతి ఇచ్చారు? మన పురుష జర్నలిస్టులు కూడా ఎందుకు మౌనంగా అక్కడ కూర్చున్నారు? అని ఆమె ప్రశ్నించారు.
ఈ ఘటనపై స్పందించిన భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) మాత్రం తమకు ఈ ప్రెస్ మీట్‌తో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. నిన్న అఫ్గానిస్థాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ న్యూఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో భారత ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర లేదు అని మంత్రిత్వ శాఖ ప్రకటనలో తెలిపింది.
తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ అక్టోబర్ 9 నుంచి 16 వరకు భారత్ పర్యటనలో ఉన్నారు. 2021లో తాలిబాన్ అఫ్గానిస్థాన్‌పై నియంత్రణ సాధించిన తర్వాత, ఇది మొదటి హై లెవెల్ ప్రతినిధి బృందం భారత్‌కి వచ్చిన సందర్భం.
పర్యటన మొదటి రోజున ముత్తాఖీ, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ను కలసి రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే మార్గాలపై చర్చించారు.అదే సందర్భంలో భారత్, అఫ్గానిస్థాన్‌లో ఆరోగ్య రంగానికి సంబంధించిన కొన్ని కొత్త ప్రాజెక్టులను ప్రకటించింది.
ఈ సంఘటనతో భారత రాజకీయ వర్గాల్లో చర్చలు ముదురుతున్నాయి. కొందరు నాయకులు దీన్ని మహిళలపై వివక్ష, భారత గౌరవానికి మచ్చ అని చెబుతుండగా, మరికొందరు దీన్ని కేవలం తాలిబాన్ నిర్వహించిన ప్రైవేట్ ఈవెంట్‌గా పేర్కొంటున్నారు. మొత్తం మీద తాలిబాన్ మంత్రి పర్యటన భారతదేశంలో మహిళా జర్నలిస్టులపై జరిగిన ఈ వివక్ష — దేశవ్యాప్తంగా రాజకీయ, సామాజిక చర్చలకు కేంద్ర బిందువుగా మారింది.