ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత నాలుగు రోజులుగా వైరల్ జ్వరంతో ఇబ్బందులు పడుతున్నారు. జ్వరం తీవ్రత తగ్గకపోవటంతో పాటు దగ్గు ఎక్కువగా రావడంతో ఆయన ఆరోగ్యం ఆందోళన కలిగించింది. వైద్యుల సూచన మేరకు పవన్ కళ్యాణ్ మంగళగిరి నుంచి హైదరాబాద్ వెళ్లి పూర్తి స్థాయి వైద్య పరీక్షలు చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఈ నేపథ్యంలో శుక్రవారం ఆయన హైదరాబాద్ బయలుదేరారు. అక్కడ వైద్యులు పూర్తి పరీక్షలు నిర్వహించి, అవసరమైన చికిత్స అందించనున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్‌కి నాలుగు రోజులుగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినప్పటికీ, ఆయన కొంతవరకు రాజకీయ మరియు వ్యక్తిగత కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల ఆరోగ్య సమస్యలు మరింత పెరిగినట్లు తెలుస్తోంది.
ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓజీ మూవీ ప్రీ–రిలీజ్ ఈవెంట్‌లో అభిమానులను నిరాశపరచకుండా వర్షంలో తడుస్తూనే పాల్గొన్నారు. అలాగే అసెంబ్లీ సమావేశాలకు హాజరై, ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ షెడ్యూల్ కారణంగానే ఆయన జ్వర తీవ్రత మరింత పెరిగిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
పవన్ కళ్యాణ్ అనారోగ్యం విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో సందేశం ఇచ్చారు. ప్రజాసేవలో తిరిగి చురుకుగా పాల్గొని, ఓజీ సినిమా విజయాన్ని ఆస్వాదించాలని ఆయన అభిలషించారు. ఇదే సమయంలో అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో ప్రార్థనలు చేస్తున్నారు.
ఇది మొదటిసారి కాదు. గతంలోనూ ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్‌తో బాధపడ్డారు. అయినప్పటికీ విశ్రాంతి తీసుకోకుండా ప్రజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన ఆరోగ్యంపై ప్రభావం పడింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో వైద్యులు పూర్తి పరీక్షలు చేసిన తర్వాతే పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత రానుంది. అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
మన డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కల్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. ఆయన త్వరగా తేరుకుని, మంచి ఆరోగ్యాన్ని పొందాలని, ఆంధ్రప్రదేశ్‌కు ఆయన చేసిన సేవతో మనకు స్ఫూర్తినిస్తూ ఉండాలని.. అంతేకాక #OG సినిమా అద్భుతమైన విజయాన్ని ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులతో జరుపుకోవాలని కోరుకుంటున్నా అని నారా లోకేష్ అన్నారు.