ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి భారీ ఉద్యోగాల కోతకు సిద్ధమైంది. కంపెనీ ఖర్చులను తగ్గించుకునే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, మంగళవారం నుంచి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30,000 మంది కార్పొరేట్ ఉద్యోగులను తొలగించనున్నట్లు అంచనా. కరోనా సమయంలో పెరిగిన డిమాండ్ కారణంగా అధికంగా నియమించుకున్న సిబ్బందిని తగ్గించుకోవడమే ఇప్పుడు ప్రధాన ఉద్దేశ్యమని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం అమెజాన్‌లో 15.5 లక్షలకుపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిలో 3.5 లక్షల మంది కార్పొరేట్ విభాగాలకు చెందినవారు. ఈ లేఆఫ్ ప్రభావం దాదాపు 10 శాతంపై పడనుందని అంచనా. 2022 చివర్లో 27,000 మంది ఉద్యోగులను తొలగించిన తర్వాత, ఇది అమెజాన్ చరిత్రలో అతిపెద్ద సిబ్బంది కోతగా భావిస్తున్నారు. అయితే ఈ వార్తలపై కంపెనీ అధికార ప్రతినిధి స్పందించడానికి నిరాకరించారు. ఈ ఉద్యోగాల కోత హ్యూమన్ రిసోర్సెస్ (People Experience & Technology), ఆపరేషన్స్, డివైజెస్, సర్వీసెస్, అలాగే కంపెనీకి కీలకమైన అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) వంటి విభాగాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది.
తొలగింపుల ప్రక్రియ మంగళవారం ఉదయం ప్రారంభమవుతుందని, ప్రభావిత ఉద్యోగులకు ఈమెయిల్ ద్వారా సమాచారం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీనికి ముందుగా మేనేజర్లకు ఉద్యోగుల నిర్వహణపై ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఈ భారీ లేఆఫ్ వెనుక పలు కారణాలున్నాయని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. కంపెనీ సీఈఓ ఆండీ జెస్సీ ఇటీవల వ్యయాలను తగ్గించడానికి, అనవసరమైన ప్రక్రియలను తొలగించడానికి చర్యలు చేపట్టారు.
ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం పెరగడంతో పునరావృతమయ్యే పనులను ఆటోమేట్ చేయడం ద్వారా మానవ వనరుల అవసరం తగ్గుతోందని విశ్లేషకులు పేర్కొన్నారు. అదనంగా, ఈ ఏడాది అమెజాన్ అమలు చేసిన ‘వారానికి ఐదు రోజులు ఆఫీసుకే రావాలి’ నిబంధన వల్ల కొంతమంది స్వచ్ఛందంగా ఉద్యోగాలు వదులుకుంటారని భావించినా, ఆ అంచనాలు విఫలమయ్యాయని సమాచారం. ఈ నేపథ్యంలో లేఆఫ్స్ తప్పనిసరి అయినట్లు తెలుస్తోంది. అయితే మరోవైపు, రాబోయే పండగ సీజన్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని గిడ్డంగులు, డెలివరీ సేవల కోసం అమెజాన్ దాదాపు 2.5 లక్షల తాత్కాలిక సిబ్బందిని నియమించుకోవాలని నిర్ణయించింది.
కంపెనీకి అత్యంత లాభదాయకమైన విభాగంగా ఉన్న అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) ఇటీవల వృద్ధి రేటులో కొంత మందగమనం చూపిస్తోంది. పోటీ సంస్థలైన మైక్రోసాఫ్ట్ అజూర్ మరియు గూగుల్ క్లౌడ్తో పోలిస్తే AWS వెనుకబడినట్లు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం అమెజాన్ మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించేందుకు సిద్ధమవుతుండగా, ఈ లేఆఫ్ నిర్ణయం ఉద్యోగుల్లో ఆందోళనను రేకెత్తిస్తోంది.