వర్షపు వాతావరణంలో వేడి వేడి పెసరట్టు, అల్లం చట్నీతో తింటే ఆ రుచి వేరే లెవల్‌లో ఉంటుంది. పెసరట్టు అంటే చాలామందికి ఇష్టమైన టిఫిన్. ముఖ్యంగా కాకినాడ పెసరట్టు ప్రత్యేకతే వేరు. ఇంట్లోనే సింపుల్‌గా కాకినాడ స్టైల్‌లో ఈ రుచికరమైన వంటకం ఎలా చేయాలో చూద్దాం.
ముందుగా కావాల్సిన పదార్థాలు సిద్ధం చేసుకోవాలి. పొట్టుతో ఉన్న పెసరపప్పు ఒక కప్పు, బియ్యం ఒకటిన్నర టేబుల్ స్పూన్, మినపప్పు ఒక టేబుల్ స్పూన్, ఉప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అవసరం. పెసరపప్పును ఒక రోజు ముందే శుభ్రంగా కడిగి నీటిలో నానబెట్టాలి. అలాగే బియ్యం, మినపప్పును కూడా వేరే బౌల్‌లో నానబెట్టుకోవాలి.
తరువాత రోజు నీళ్లు వంపేసి పెసరపప్పును మిక్సీలో వేసి, ఉప్పు, పసుపు, నీరు కలిపి మెత్తగా పిండిగా చేసుకోవాలి. అలాగే బియ్యం, మినపప్పును కూడా గ్రైండ్ చేసి ఈ రెండింటినీ కలపాలి. పిండి సిద్ధం అయిన తర్వాత దోసె పెనం వేడి చేసి, మంట తగ్గించి, గరిటెడు పిండి వేసి మందంగా స్ప్రెడ్ చేయాలి.
తర్వాత ఉల్లిపాయ ముక్కలు, నానబెట్టిన పెసరపప్పు, ధనియాల పొడి వేసి, రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. అంతే, టేస్టీ టేస్టీ కాకినాడ పెసరట్టు రెడీ. దీన్ని అల్లం చట్నీ లేదా పల్లీ చట్నీతో తింటే నోరూరించే రుచి ఆస్వాదించవచ్చు.