ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం విజయవంతంగా కొనసాగుతోందని ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆయన శ్రీ సత్యసాయి జిల్లాలోని మడకశిర డిపోను పరిశీలించిన సందర్భంగా మాట్లాడుతూ, ఈ పథకం అమలుతో ప్రస్తుతం రోజుకు సుమారు 18 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తున్నారని, త్వరలో ఈ సంఖ్య 26 లక్షలకు పెరగవచ్చని అంచనా వేశారని తెలిపారు. ఈ సదుపాయం మరింత సులభం కావడానికి క్యూఆర్ కోడ్‌తో కూడిన స్మార్ట్ కార్డులు జారీ చేయనున్నామని ఆయన చెప్పారు.
మహిళల ఉచిత ప్రయాణం కారణంగా ఆర్టీసీకి ఎలాంటి నష్టం రాకుండా ప్రభుత్వం ఆ వ్యయాన్ని భరిస్తోందని ఎండీ పేర్కొన్నారు. అంతేకాకుండా, ఈ పథకాన్ని అంతర్రాష్ట్ర బస్సుల్లో కూడా అమలు చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నామని.. త్వరలో దీనిపై సమీక్ష జరిపి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆధార్ జిరాక్స్ కాపీలను గుర్తింపుగా అనుమతించాలన్న ఆదేశాలు కూడా జారీ చేసినట్లు వెల్లడించారు.
స్త్రీ శక్తి పథకం కింద కొన్ని డిపోల్లో ఈ కార్యక్రమం 100 శాతం విజయవంతమైందని తుని డిపోలో అయితే 106 శాతం రికార్డు నమోదైందని ఆయన తెలిపారు. మహిళలు ఈ పథకం పట్ల సంతృప్తిగా ఉన్నారని త్వరలో ఆర్టీసీకి 1,150 కొత్త బస్సులు రానున్నాయని ఆయన చెప్పారు. దీనికి ఇప్పటికే ప్రభుత్వ అనుమతులు వచ్చాయని తెలిపారు.
అయితే, ఈ పథకం అన్ని రకాల బస్సులకు వర్తించదని ఎండీ స్పష్టం చేశారు. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మాత్రమే ఈ సౌకర్యం ఉంటుంది. కానీ నాన్‌స్టాప్, అంతర్రాష్ట్ర, ఆల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్, ఏసీ బస్సుల్లో మాత్రం మహిళలు టికెట్ కొనాల్సిందే.