ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదానీ సంస్థకు కడప జిల్లాలో భారీ స్థాయిలో భూములు కేటాయించింది. ఈ కేటాయింపులు తాజాగా జరిగినవి కావు. ఇప్పటికే 2016లోనే ధోడియం, వడ్డిరాల గ్రామాల్లో 250 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్ట్ కోసం సుమారు 1200 ఎకరాలు కేటాయించారు. 2019లో ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యి వినియోగంలోకి వచ్చింది.
అయితే ఇప్పటివరకు భూ కేటాయింపు ఉత్తర్వులు జారీ చేయలేదు. తాజాగా ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకొని రెవెన్యూ శాఖ ద్వారా జీఓలు విడుదల చేసింది. ఈ భూమిని 33 సంవత్సరాల లీజుపై అదానీ సంస్థకు ఇచ్చింది. లీజు ఫీజు మాత్రం 2019 నాటి మార్కెట్ విలువ ఆధారంగానే నిర్ణయించింది. ప్రతి ఐదేళ్లకోసారి 10 శాతం లీజు ఫీజు పెంచాలని కూడా ఉత్తర్వుల్లో స్పష్టతనిచ్చింది.
ధోడియం ప్రాంతంలో ఎకరా విలువను ₹3 లక్షలుగా, వడ్డిరాలలో ఎకరా విలువను ₹6.25 లక్షలుగా ఖరారు చేశారు. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై భూకేటాయింపు ప్రక్రియకు అధికారిక ముగింపు లభించింది.