పంజాబ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. హోషియార్‌పూర్ జిల్లాలోని మండియాలా వద్ద ఎల్పీజీ గ్యాస్ ట్యాంకర్ ఓ ట్రక్కును ఢీకొట్టింది. ఢీ కొట్టిన వెంటనే ట్యాంకర్ నుంచి గ్యాస్ లీకై భారీ పేలుడు సంభవించింది.
మంటలు ఆకాశాన్ని తాకేలా ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరికొందరు మృతిచెందడంతో ప్రాణనష్టం ఏడుకి పెరిగింది. మరో 15 మంది తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రులకు తరలించారు.
ఈ ప్రమాదంపై డిప్యూటీ కమిషనర్ ఆషికా జైన్ స్పందిస్తూ.. సమాచారం అందిన వెంటనే అంబులెన్స్‌లు, అగ్నిమాపక వాహనాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయని తెలిపారు. బాధిత కుటుంబాలకు పంజాబ్ మంత్రి రవ్‌జోత్ సింగ్ పరామర్శ చేసి, ప్రభుత్వం సహాయం అందిస్తుందని హామీ ఇచ్చారు.