మన శరీరంలో ప్లేట్‌లెట్లు రక్తం గడ్డకట్టడానికి, గాయాలు నయం కావడానికి కీలక పాత్ర పోషిస్తాయి. అయితే డెంగ్యూ, అనీమియా, రక్తపోటు సమస్యలు లేదా కొన్ని మందుల వాడకం వల్ల ప్లేట్‌లెట్ కౌంట్ తగ్గిపోవచ్చు. ఈ పరిస్థితి ప్రమాదకరమై, రక్తస్రావం నియంత్రణలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాంటి సమయంలో సహజ ఆహార పదార్థాలు, ముఖ్యంగా పండ్లు ఉపయోగకరంగా ఉంటాయి. కివి, బొప్పాయి వంటి పండ్లు ప్లేట్‌లెట్ కౌంట్ పెంపులో చాలా మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ రెండింటిలో ఏది ఉత్తమమో తెలుసుకోవడం ఆసక్తికరం.
ముందుగా కివి గురించి మాట్లాడితే, ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచి, రక్తనాళాల బలం కోసం అవసరమైన కొల్లాజెన్ ఉత్పత్తిలో సహాయపడుతుంది. అదేవిధంగా ఫోలేట్ ఉండటం వలన ఎర్ర రక్త కణాలు మరియు ప్లేట్‌లెట్ల ఆరోగ్యకరమైన ఉత్పత్తికి మద్దతు ఇస్తుంది. కివిలో ఉన్న యాంటీఆక్సిడెంట్లు ప్లేట్‌లెట్లను ఆక్సీకరణ ఒత్తిడి నుండి కాపాడతాయి. అలాగే ఆక్టినిడిన్ అనే ప్రత్యేక ఎంజైమ్ జీర్ణక్రియను మెరుగుపరచి, శరీరానికి పోషకాలను బాగా అందుకునేలా చేస్తుంది.
బొప్పాయి విషయానికి వస్తే, ఇది ప్లేట్‌లెట్ పెంపులో మరింత ప్రత్యక్ష పాత్ర పోషిస్తుంది. బొప్పాయిలో కూడా విటమిన్ సి ఉంటుంది కానీ దీని అసలు బలం బొప్పాయి ఆకులలో ఉంటుంది. ముఖ్యంగా డెంగ్యూ జ్వరం సమయంలో బొప్పాయి ఆకుల రసం ప్లేట్‌లెట్ కౌంట్ పెంచడానికి విస్తృతంగా ఉపయోగిస్తారు. బొప్పాయిలో బీటా-కెరోటిన్, ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉండి ఇన్ఫెక్షన్ల నుంచి త్వరగా కోలుకోవడంలో సహాయపడతాయి. అదనంగా, పపైన్ ఎంజైమ్ జీర్ణక్రియను సజావుగా చేసి శరీరానికి అవసరమైన పోషకాలను సులభంగా అందిస్తుంది.
కివి, బొప్పాయి రెండూ శోథ నిరోధక లక్షణాలు కలిగి ఉన్నాయి. కివి వలన ఎముక మజ్జ పనితీరు మెరుగుపడుతుంటే, బొప్పాయిలోని పాపైన్, కైమోపాపైన్ వాపును తగ్గించి కోలుకునే వేగాన్ని పెంచుతాయి. అలాగే హైడ్రేషన్ పరంగా బొప్పాయిలో నీటి శాతం ఎక్కువగా ఉండి నిర్జలీకరణను నివారించడంలో సహాయపడుతుంది. కివి పొటాషియం పుష్కలంగా ఉండి, జ్వరాల నుంచి కోలుకునే సమయంలో శరీరానికి శక్తినిస్తుంది.
మొత్తానికి రెండు పండ్లూ తమదైన ప్రత్యేకతను కలిగి ఉన్నప్పటికీ, ప్లేట్‌లెట్ కౌంట్ పెంచడంలో బొప్పాయి ప్రభావం కివితో పోలిస్తే మరింత ఎక్కువ. ముఖ్యంగా డెంగ్యూ వంటి పరిస్థితుల్లో బొప్పాయి పండు మరియు ఆకుల వినియోగం వైద్యపరంగా మంచి ఫలితాలు ఇస్తాయని అనుభవం చెబుతోంది. అయితే ఏ ఆహారాన్ని ఎంచుకున్నా, వైద్యుల సలహాతోనే ఉపయోగించడం ఉత్తమం. సహజ పద్ధతులు శరీరానికి తోడ్పాటుగా ఉన్నప్పటికీ, సమయానికి సరైన వైద్యం తీసుకోవడం మరింత ముఖ్యమని గుర్తు పెట్టుకోవాలి.