ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ టీచర్లకు ప్రత్యేక సర్‌ప్రైజ్ ఇచ్చారు. పిఠాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లి మండలాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న 2 వేల మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులకు బహుమతులు పంపించారు. మహిళలకు చీరలు, పురుషులకు ప్యాంటు-షర్టులు అందజేశారు.
డిప్యూటీ సీఎం పంపిన ఈ కానుకలు ప్రత్యేక బృందం ద్వారా విద్యాశాఖ కార్యాలయాలకు చేరాయి. అనంతరం వాటిని టీచర్లకు పంపిణీ చేశారు. పవన్ పంపిన బహుమతులు అందుకున్న ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేస్తూ, ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదే కాకుండా, పవన్ కళ్యాణ్ తరచూ ప్రజలతో అనుబంధాన్ని చాటుకుంటున్నారు. గత నెలలో శ్రావణ మాసం సందర్భంగా పిఠాపురం మహిళలకు చీరలు పంపారు. గిరిజనుల కోసం చెప్పులు, రగ్గులు, మామిడి పండ్లు పంపించి సాయం చేశారు. ఇక సెప్టెంబర్ 5న ఆయన అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకులోయ మడగడ గ్రామంలో జరగనున్న బలి పోరోబ్ ఉత్సవంలో పాల్గొననున్నారు.