Muralidhar Mohol: ఢిల్లీ గగనతలంలో జీపీఎస్ స్పూఫింగ్ లు... కేంద్రం వివరణ!
Muralidhar Mohol: దేశ రాజధాని ఢిల్లీ గగనతలంలో విమానాలకు తీవ్రమైన సమస్య ఎదురవుతోంది. విమానాల గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్) సిగ్నళ్లకు తరచూ అంతరాయం కలుగుతోంది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లోనే ఏకంగా 623 సార్లు జీపీఎస్ అంతరాయ ఘటనలు (జీపీఎస్ స్పూఫింగ్ లు) నమోదయ్యాయని కేంద్ర …
- ఈ ఏడాది తొలి రెండు నెలల్లోనే 623 ఘటనలు నమోదు..
- భద్రతకు చర్యలు తీసుకుంటున్నామన్న డీజీసీఏ, విమానయాన శాఖ..
Muralidhar Mohol: దేశ రాజధాని ఢిల్లీ గగనతలంలో ప్రయాణించే విమానాలకు ఇటీవల ఒక వింతైన సాంకేతిక సమస్య ఎదురవుతోంది. విమానాల గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్) సిగ్నళ్లకు తరచూ అంతరాయం కలుగుతుండటం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. కేవలం ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లోనే ఏకంగా 623 సార్లు ఇలాంటి ఘటనలు నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వం గురువారం పార్లమెంటు సాక్షిగా వెల్లడించింది. దీనిని సాంకేతిక పరిభాషలో 'జీపీఎస్ స్పూఫింగ్' అని పిలుస్తారు. అంటే ఉద్దేశపూర్వకంగా రేడియో ఫ్రీక్వెన్సీలో జోక్యం చేసుకోవడం ద్వారా విమానానికి అందే సిగ్నళ్లను తారుమారు చేయడం అన్నమాట. లోక్‌సభలో అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ స్పందిస్తూ, 2023 నవంబర్ నుంచి 2025 డిసెంబర్ మధ్య కాలంలో మొత్తం 2,354 సార్లు ఇలాంటి సమస్యలు తలెత్తాయని వివరించారు.
ఈ జీపీఎస్ స్పూఫింగ్ అనేది విమాన భద్రతకు అత్యంత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల విమానం ఎక్కడుందో పైలట్‌కు తప్పుగా చూపించడం లేదా విమానం భూమికి చాలా దగ్గరగా ఉన్నట్లు తప్పుడు హెచ్చరికలు రావడం వంటివి జరుగుతాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు (ATC) అప్రమత్తమై నేరుగా పైలట్లకు మార్గనిర్దేశం చేస్తూ విమానాలను సురక్షితంగా నడిపిస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఇప్పటికే రంగంలోకి దిగింది. 2023లో అడ్వైజరీ సర్క్యులర్ జారీ చేయడంతో పాటు, 2025 నవంబర్ 10న ఒక ప్రత్యేకమైన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP)ను కూడా రూపొందించింది. ఈ ఘటనల మూలాలను కనిపెట్టేందుకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) వైర్‌లెస్ మానిటరింగ్ ఆర్గనైజేషన్ సహాయం కోరింది.
మరోవైపు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఈ అంశంపై గతంలోనే స్పష్టతనిచ్చారు. ఢిల్లీ విమానాశ్రయంలోని రన్‌వే 10 వైపు వచ్చే విమానాలకు మాత్రమే ఈ సమస్య ఎక్కువగా ఎదురవుతోందని, అయితే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవడం వల్ల ఇతర రన్‌వేల ద్వారా విమానాల రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలగలేదని ఆయన భరోసా ఇచ్చారు. సాంకేతిక లోపాలను సరిదిద్దుతూ ప్రయాణికుల భద్రతకు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. అయినప్పటికీ, ఇంత భారీ స్థాయిలో సిగ్నల్ అంతరాయం కలగడం వెనుక ఉన్న అసలు కారణాలను అధికారులు లోతుగా విశ్లేషిస్తున్నారు.
Be the first to react