భారత ప్రభుత్వం ప్రయాణికుల సౌకర్యం కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా 6,115 రైల్వే స్టేషన్లలో ఉచిత హై-స్పీడ్ వైఫై అందుబాటులోకి వచ్చింది. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాజ్యసభలో ఈ విషయాన్ని ప్రకటించారు. ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, కాచిగూడ, సికింద్రాబాద్ వంటి ప్రధాన స్టేషన్లతో పాటు చిన్న పట్టణాల స్టేషన్లలో కూడా ఈ సదుపాయం అందుబాటులో ఉంది. ఈ వైఫై సేవలను రైల్టెల్ అనే ప్రభుత్వ సంస్థ నిర్వహిస్తోంది.
ఉచిత హై-స్పీడ్ వైఫై సౌకర్యం ప్రయాణికులకు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకవైపు వినోదం కోసం మూవీస్, పాటలు, గేమ్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మరోవైపు ఆఫీస్ పనులు, అత్యవసర ఇమెయిల్స్, వీడియో కాల్స్ కూడా చేయవచ్చు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఇది ఎంతో సహాయపడుతుంది, ఎందుకంటే అక్కడ ఇంటర్నెట్ సదుపాయం సరిగా అందుబాటులో ఉండదు. మొబైల్ డేటా లేకపోయినా స్టేషన్‌లో ఉచితంగా వేగవంతమైన ఇంటర్నెట్‌ను ఉపయోగించుకోవచ్చు.
ఈ సదుపాయం ఉపయోగించడం కూడా చాలా సులభం. ముందుగా మొబైల్‌లో వైఫై ఆన్ చేసి “RailWire” నెట్‌వర్క్‌ను సెలెక్ట్ చేయాలి. లాగిన్ పేజ్‌లో మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే, OTP వస్తుంది. ఆ కోడ్‌ను ఎంటర్ చేసిన వెంటనే హై-స్పీడ్ ఇంటర్నెట్ అందుతుంది. ప్రస్తుతం 4G/5G నెట్‌వర్క్ ఉన్నా, ఉచిత హై-స్పీడ్ వైఫై మాత్రం ప్రత్యేకమైన సౌకర్యం.
ఇది విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, పర్యాటకులు—అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. పరీక్షల కోసం చదువుకునే విద్యార్థులు స్టేషన్‌లోనే మెటీరియల్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఉద్యోగులు మీటింగ్స్‌లో పాల్గొనవచ్చు. కుటుంబ సభ్యులతో వీడియో కాల్స్ చేయడం, ఆన్‌లైన్ బుకింగ్స్ చేవవంటి వంటి వాటికి వినియోగించుకోవచ్చు.
మొత్తం మీద, భారతీయ రైల్వే స్టేషన్లలో ఉచిత హై-స్పీడ్ వైఫై అందుబాటులోకి రావడం ఒక సాంకేతిక విప్లవం. ఇది కేవలం ప్రయాణికులకే కాదు, దేశవ్యాప్తంగా డిజిటల్ కనెక్టివిటీని పెంచే దిశగా తీసుకున్న ముందడుగు. చిన్న పట్టణాలు, గ్రామాల ప్రజలు కూడా ఇప్పుడు డిజిటల్ ఇండియాలో భాగమవుతున్నారు.