ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలకు పలు వరాలు ప్రకటించారు. దీపావళి పండుగకు రాష్ట్రవ్యాప్తంగా మూడు లక్షల ఇళ్ల గృహప్రవేశాలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
స్త్రీశక్తి పథకం ద్వారా ఇప్పటివరకు కోట్లాది మహిళలు RTC బస్సుల్లో ఉచితంగా ప్రయాణించినట్టు తెలిపారు. అయితే దీనివల్ల ఆటో డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించామన్నారు. అందుకే వారికి ఒక్కొక్కరికి రూ.15 వేల ఆర్థిక సాయం అందిస్తామని, ఈ నెల 4న నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించారు.
దేశంలోనే పింఛన్ల పంపిణీలో ఆంధ్రప్రదేశ్ ముందుందని సీఎం తెలిపారు. ఇప్పటివరకు 63.55 లక్షల మందికి రూ.48,019 కోట్ల పింఛన్లు ఇచ్చామని వివరించారు. పింఛనుదారు మరణించిన వెంటనే భార్యకు పింఛను మంజూరు చేస్తున్నామని చెప్పారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘సూపర్ సిక్స్’ పథకాలు సక్సెస్ అయ్యాయని వ్యాఖ్యానించారు.
గత ప్రభుత్వం విద్యుత్తు ఛార్జీలు తొమ్మిదిసార్లు పెంచి ప్రజలకు భారమయ్యిందని, తాము వచ్చాక ఛార్జీలు పెంచలేదని అన్నారు. నవంబరు నుంచి ట్రూ అప్ ఛార్జీలు తగ్గిస్తామని, సాధారణ ఛార్జీల తగ్గింపును కూడా పరిశీలిస్తున్నామని హామీ ఇచ్చారు.
మహిళల కోసం దీపం-2 పథకం కింద ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని, డ్వాక్రా సంఘాలను మరింత బలపరుస్తామని సీఎం చెప్పారు. ఒక్క రూపాయి లంచం లేకుండా పేదల పాలన అందించడమే లక్ష్యమని స్పష్టం చేశారు.
పౌర సేవలను WhatsApp ద్వారా అందిస్తున్నామని, ప్రజల సమస్యలు నేరుగా తన దృష్టికి వస్తున్నాయని వివరించారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలని తన అభిలాష అని అన్నారు.
P-4 కార్యక్రమం ద్వారా పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తామన్నారు. ఆడబిడ్డల రక్షణకు కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని చంద్రబాబు తెలిపారు. పేదల కోసం చివరి శ్వాస వరకు పనిచేస్తానని హామీ ఇచ్చారు.