ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనకు సంబంధించిన ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ పర్యటనకు జీఏడీ పొలిటికల్ సెక్రటరీ ముకేష్ కుమార్ మీనా అనుమతి జారీ చేశారు. అక్టోబర్ 22 నుంచి 24 వరకు ఆయన దుబాయ్, అబుదాబి, యూఏఈ ప్రాంతాల్లో పర్యటించనున్నారు.
ఈ పర్యటన ప్రధాన ఉద్దేశ్యం పార్టనర్‌షిప్ సమ్మిట్ 2025 కు ముందుగా గ్లోబల్ పెట్టుబడులను ఆకర్షించడం. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో ఈ సమ్మిట్ జరగనుంది. రియల్ ఎస్టేట్, నిర్మాణం, లాజిస్టిక్స్, రవాణా, ఫైనాన్స్, ఇన్నోవేషన్ వంటి విభాగాల్లో పెట్టుబడులు రాబట్టే దిశగా చంద్రబాబు కీలకంగా చర్చలు జరపనున్నారు.
సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్ధన్ రెడ్డి, పరిశ్రమలు, పెట్టుబడులు, ఏపీఐఐసీ శాఖల ఉన్నతాధికారులు కూడా ఈ పర్యటనలో పాల్గొంటారు. ఈ బృందం పెట్టుబడిదారులను కలుసుకుని, ఏపీలో పెట్టుబడులు పెట్టే అవకాశాలను వివరించనుంది.
రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు ముందుగానే వ్యూహాత్మక చర్యలు తీసుకుంటున్నారు. అమరావతి రాజధాని ప్రాజెక్ట్‌తో పాటు, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి దిశగా ఆయన శ్రమిస్తున్నారు. గతంలో సింగపూర్, దావోస్‌లో కూడా చంద్రబాబు చేసిన పర్యటనలు పెట్టుబడుల ఆకర్షణలో మంచి ఫలితాలు ఇచ్చాయి.
ఈ సారి యూఏఈ పర్యటన కూడా అదే తరహాలో ఏపీకి భారీ పెట్టుబడులు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే వివిధ దేశాల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు సమ్మిట్‌కు ఆహ్వానించబడ్డారు. దీంతో, ఈ పర్యటన రాష్ట్ర అభివృద్ధికి కొత్త అవకాశాలు తెరచి పెట్టబోతోందని భావిస్తున్నారు.