ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వా (జలచర) రైతులకు భారీగా ఆర్థిక సహాయం అందుతోంది. నాబార్డు, ఏపీ గ్రామీణ బ్యాంక్, ఆక్వా ఎక్స్ఛేంజ్ సంస్థలు కలిసి 100 మంది ఆక్వా రైతులకు రూ.25 కోట్ల రుణాలు విడుదల చేశారు. ఒక్కో రైతుకు ఎకరాకు రూ.25 లక్షల వరకు ఈ రుణాలు అందుతాయని వెల్లడించారు. ఈ రుణాల ద్వారా రైతులకు ఆధునిక టెక్నాలజీ, మార్కెటింగ్ సౌకర్యాలు లభించి వారి ఆదాయం పెరిగే అవకాశం ఉందని ఆశిస్తున్నారు.
ఈ పథకం కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలో ప్రారంభం అయింది. ఆక్వా ఎక్స్ఛేంజ్ అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంలో ఈ రుణాల చెల్లింపు జరిగింది. నాబార్డు, ఆక్వా ఎక్స్ఛేంజ్, ఏపీ గ్రామీణ బ్యాంక్ మద్య ఒప్పందాలు కుదిరి, రైతులకు అవసరమైన పావర్ మోనిటరింగ్ కిట్లు కూడా అందజేశారు.
ఆక్వా రంగం దేశ జీడీపీలో 1.1 శాతం వాటాను కలిగి ఉంది. దాదాపు 2.8 కోట్ల మంది జీవనం దీని మీద ఆధారపడుతున్నారు. గతంలో ఆక్వా సాగులో అనేక సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ, ఈ రుణాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించడం ద్వారా రైతుల పరిస్థితి మెరుగుపడుతుందని వారు అభిప్రాయపడ్డారు. నాబార్డు మరియు ఇతర సంస్థల ద్వారా మద్దతుతో ఆక్వా రైతులు మరింత ఉత్సాహంతో ఉన్నారు.