ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధిలో మరో ముందడుగు పడింది. చిత్తూరు జిల్లాలోని కుప్పం, నెల్లూరు జిల్లాలోని దగదర్తిలో కొత్తగా రెండు విమానాశ్రయాల నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టులను పీపీపీ (PPP) విధానంలో నిర్మించేందుకు ఏపీఏడీసీఎల్ (APADCL)కు అనుమతి లభించింది. ఇప్పటికే రైట్స్ సంస్థ చేసిన టెక్నో–ఎకనమిక్ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఆధారంగా నిర్ణయం తీసుకోగా, ప్రాజెక్ట్ కోసం ముసాయిదా ఆర్‌ఎఫ్‌పీకి కూడా ఆమోదం లభించింది.
ఈ రెండు ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి కావలసిన భూసేకరణ కోసం హడ్కో నుంచి రుణం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెవెన్యూ అధికారులు ఇప్పటికే భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. ఇటీవల ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేయగా, రైతులు అభ్యంతరాలు ఉంటే 60 రోజుల్లో తెలియజేయాలని సూచించారు. ప్రభుత్వం 2027 నాటికి ప్రాజెక్టులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
కుప్పంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణం ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. ఇది మూడు రాష్ట్రాల కూడలిలో ఉండటంతో పాటు బెంగళూరు విమానాశ్రయంపై ఉన్న ఒత్తిడిని తగ్గించే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశంలో మూడవ అత్యంత రద్దీగా ఉన్న కెంపేగౌడ విమానాశ్రయానికి ప్రత్యామ్నాయంగా కుప్పం విమానాశ్రయం ప్రయాణికులకు ఉపయోగపడనుంది. ప్రతిపాదిత హైవే పూర్తవడంతో కుప్పానికి 60–90 నిమిషాల్లో చేరుకునే అవకాశం ఉంది. అలాగే, ఈ విమానాశ్రయం ద్వారా కూరగాయలు, పండ్లు ఎగుమతి చేయడం వల్ల రైతుల ఆదాయం పెరగనుందని ప్రభుత్వం భావిస్తోంది.
దగదర్తి విమానాశ్రయం కూడా వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగిఉంది. నెల్లూరు జిల్లాలో పరిశ్రమలు, ఐటీ, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఇది దోహదం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో సౌకర్యాలు తక్కువగా ఉండడం, ఛార్జీలు ఎక్కువగా ఉండటం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కుప్పం, దగదర్తి ఎయిర్‌పోర్టులు ప్రారంభమైతే ఈ సమస్యలు తగ్గి, ప్రయాణికులకు సౌకర్యాలు పెరుగుతాయని ఆశాజనకంగా చూస్తున్నారు.
ఇక కుప్పం విమానాశ్రయ ప్రాజెక్టు మొదటగా 2014–19లో చంద్రబాబు నాయుడు హయాంలో ప్రారంభమైంది. అప్పట్లో భూసేకరణ కూడా చేపట్టారు కానీ 2019లో ప్రాజెక్టు ఆగిపోయింది. ఇప్పుడు మళ్లీ ఊపందుకోవడంతో ఈ రెండు ఎయిర్‌పోర్టుల పనులు వేగంగా జరగనున్నాయి. మొత్తం మీద, ఈ ప్రాజెక్టులు ఏపీలో రవాణా, వాణిజ్య రంగాల అభివృద్ధికి కీలకంగా నిలవనున్నాయి.